చిన్పప్పుడు నిద్రపోకపోతే..?

నిద్ర..పగలంతా కష్టపడే శరీరం తిరిగి రేపటి రోజున ఉత్సాహంగా పనిచేయడానికి ఉద్దేశించిన జీవక్రియ. నిద్రను జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ నిద్రే ఆరోగ్యాన్ని, చక్కగా కాపాడుతుంది. నిద్రకు ఉన్న బలం అదే. నిద్ర ద్వారా శరీరంలోని అవయవాలన్నీ రీఛార్జ్ అవుతాయి. రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి అనే దాన్ని నిర్థారించలేం. వయసు, ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నిద్ర ముడిపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన మనుషుల్లో రోజుకి 7-8 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వయస్సువారు, చిన్నారుల్లో ఎక్కువ సేపు నిద్ర అవసరమవుతుంది. ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హర్మోన్ నిద్రతో ముడిపడి ఉంటుంది. అందుకే చిన్నారులు ఎక్కువసేపు నిద్రపోతారు.

 

దీని వలన వారిలో గ్రోత్ హర్మోన్ ఎక్కువగా స్రవించబడుతుంది. ఫలితంగా చిన్నారులు చక్కగా ఎదగగలుగుతారు. అప్పుడే పుట్టిన పసికందులు 15-18 గంటలపాటు నిద్రలోనే ఉంటారు. ఎదిగే కొద్దీ ఈ సమయం తగ్గుతూ వస్తుంది. బడికి వెళ్లే పిల్లలకు 10-12 గంటల పాటు నిద్ర అవసరం. మారుతున్న జీవనశైలి అన్ని రకాల వయసుల వారికి నిద్రను దూరం చేసినట్లే పసిపిల్లలకూ నిద్ర సమయాన్ని తగ్గించేసింది. మీ చిన్నారులు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే మేల్కొండి ఎందుకంటే బాల్యంలో నిద్రలేమిని ఎదుర్కొనే చిన్నారులు భవిష్యత్తులో నిరాశ, నిస్పృహలకు గురయ్యే ప్రమాదముందని తాజా అధ్యయనంలో తేలింది.

 

వాటి తాలుకూ జాడలు చిన్నవయసులోనే కనిపించాయట..ఈ చిన్నారుల్లో నిద్రలేమితో పాటు ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, ఉత్కంఠ, మితిమీరిన సిగ్గు, అనవసర భయాలు, భావాలను వెల్లడించలేకపోవటం వంటి వాటిని ఎదుర్కొంటారని పరిశోధకులు వెల్లడించారు. వీటి కారణంగా ఆ చిన్నారులు పెరిగి పెద్దయ్యాక తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతారని వారు తెలిపారు. కాబట్టి..మీ పిల్లలు  చిన్న వయస్సులోనే నిద్రలేమి, లేదా నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే పెద్దలు గుర్తించాలి. వెంటనే వైద్యుల సహాయంతో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించటం వల్ల, మీ చిన్నారులు పెరిగి పెద్దయిన తరువాత వారి జీవితాన్ని నాశనం చేసుకోకుండా కాపాడినవారవుతారు.