పాక్ క్రికెటర్లను భారత్‌లో అడుగుపెట్టనివ్వం

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. దాయాదుల పోరును ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూస్తుంది. అయితే ఉరి ఉగ్ర ఘటన తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లపై చర్చించడానికి దుబాయ్‌లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు సమావేశం అవుతుండటంపై భారత క్రీడల మంత్రి విజయ్ గోయెల్ స్పందించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచి పెట్టేంత వరకు భారత్-పాక్ దేశాల మధ్య సిరీస్‌లు జరగవని ఆయన తేల్చిచెప్పారు. క్రికెట్, కబడ్డీ, హాకీ లీగుల్లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లు భారతగడ్డపై అడుగుపెట్టేందుకు వీల్లేదని గోయెల్ అన్నారు. బీసీసీఐ, పీసీబీ 2015 నుంచి 2023 సంవత్సరాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఆ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు ఏర్పడటంతో సిరీస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సిరీస్‌లు ఆడకపోవడంతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని దీనికి నష్టపరిహారం చెల్లించాలని బీసీసీఐకి పీసీబీ నోటీసులు పంపింది. దీనిపై చర్చించేందుకు రెండు బోర్డులు దుబాయ్‌లో సమావేశం కావాలని నిర్ణయించాయి.