ఇండియాలో ముద్దుల పోటీ గురించి తెలుసా..?


 


కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భారతదేశంలో ప్రాంతానికీ.. ప్రాంతానికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. విభిన్న జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతితో పాటు ఈ దేశంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు. ప్రపంచానికి అంతు చిక్కని ఎన్నో రహస్యాలను భారతమాత తనలో దాచుకొంది. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఏదో ఓ పర్యాటక ప్రదేశం.. వింతలు మనల్ని ఆకర్షిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతగా అభివృద్ధి సాధించినా.. విదేశీ విధానాలను అనుసరించినా.. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం అనేది భారతీయ సంస్కృతి ఇప్పటికీ ఒప్పుకోదు. అలాంటి సమాజంలో ఏకంగా ముద్దుల పోటీ పెడితే అసలు జరుగుతుందా.. సాంప్రదాయ వాదులు అందుకు అంగీకరిస్తారా..? కానీ ఇది జరిగింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ జిల్లా డుమారియా గ్రామంలో ఈ లిప్‌లాక్ పోటీలు జరిగాయి. పెళ్లయిన గిరిజన దంపతులు ఈ పోటీల్లో పాల్గొంటారు.. ఎవరు ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటే.. వారి మధ్య అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. నిర్వాహకులు చెప్పిన సమయం వరకు ఎవరు నిలుస్తారో ఆ జంటలకు బహుమతులు అందిస్తారు. అన్నట్లు ఈ పోటీలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో జరగడం విశేషం. గిరిజనులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు.. అందుకే వారి కుటుంబాల్లో బంధాలు అంత బలంగా ఉండవు. గిరిజన జంటల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నా అని ఎమ్మెల్యే సిమన్ మరాండి చెప్పారు. అయితే ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని.. ఇలాంటి వాటి వల్ల యువత చెడిపోయే ప్రమాదముందని మహిళా సంఘాలు హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించాయి.