TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమి అమ్మి భార్యను చదివిస్తే.. ఉద్యోగం రాగానే ప్రియుడితో జంప్.. భర్త కన్నీటి గాథ!

Published on: Sat May 30, 2026 1:16PM

 

కట్టుకున్న భార్య ఉన్నత చదువులు చదవాలని, సమాజంలో ఒక మంచి హోదాలో నిలబడాలని ఆ భర్త కలలు కన్నాడు. ఆమె ఆశయానికి తన పేదరికం అడ్డుకాకూడదని భావించాడు. అందుకే, తనకున్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేసి మరి ఆమెను చదివించాడు. కానీ, చివరకు ఆ భార్య ప్రభుత్వ ఉద్యోగం సాధించాక, కన్న కొడుకును, కట్టుకున్న భర్తను నడిరోడ్డున వదిలేసి మరొకరితో వెళ్ళిపోయింది. ఈ హృదయవిదారక సంఘటన బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ కథలోని పూర్తి వివరాల్లోకి వెళితే, బిదుపూర్‌కు చెందిన అమన్ కుమార్‌కు, గుంజన్ కుమారికి 2013 లో వివాహం జరిగింది. పెళ్లయ్యే నాటికి గుంజన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తి చేసింది. అయితే, తాను ఉన్నత చదువులు చదువుకుని ఎలాగైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఆమె కోరిక. అమన్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, భార్య కలను నిజం చేయడానికి వెనకాడలేదు. 

ఆమె డిగ్రీ, ఆపై బీఎడ్ చదవడానికి అయ్యే ఖర్చుల కోసం తనకున్న సొంత భూమిని అమ్మేశాడు. భర్త చూపిన చొరవతో గుంజన్ తీవ్రంగా శ్రమించి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC TRE-02) ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది.ఉద్యోగం వచ్చాక ఆమె సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్‌లో శిక్షణ పొందింది. ఆ తర్వాత వైశాలి జిల్లా, బిదుపూర్ బ్లాక్‌లోని యుఎంఎస్ మోహన్‌పూర్ ధరంపూర్ పాఠశాలకు బదిలీ అయింది. 

అయితే, ఈ శిక్షణ కాలంలోనే గుంజన్‌కు తన పాత కాలేజీ స్నేహితుడైన ప్రేమ్ ప్రకాష్ జైస్వాల్‌తో మళ్లీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త అమన్ కుమార్‌కు తెలియడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు గుంజన్ తన భర్తను, వారి 10 ఏళ్ల కొడుకును పూర్తిగా వదిలేసి, ప్రేమ్ ప్రకాష్‌తో కలిసి ఒక అద్దె ఇంట్లో రహస్యంగా జీవించడం ప్రారంభించింది.

మే 25వ తేదీన గుంజన్ తన ప్రియుడితో కలిసి అద్దె ఇంట్లో ఏకాంతంగా ఉన్నట్లు భర్త అమన్ కుమార్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అమన్, నేరుగా ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరూ చనువుగా ఉన్న దృశ్యాన్ని చూసి అతడి గుండె బద్దలైంది. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన అమన్, వారికి తెలియకుండా బయట నుంచి తలుపులకు తాళం వేసి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీసి విచారణ జరుపుతుండగా, భార్య గుంజన్ తప్పు చేసి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా భర్త అమన్‌పై విరుచుకుపడింది. నడిరోడ్డుపై భర్తతో తీవ్రంగా గొడవ పెట్టుకుంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు ఆ భార్య ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. భర్త త్యాగాన్ని కాలరాసి, 10 ఏళ్ల కన్న కొడుకును వదిలేసిన ఆమెకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.