హోంమంత్రిగారు మరోసారి లెక్క తప్పారు!
Published on: Wed Feb 17, 2016 4:04PM

కేంద్ర హోంమంత్రి అంటే అందరి చూపులు ఆయన వైపే ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి చిన్న మాటనీ శిరసావహించడానికి అధికార పక్షం, దానిని రాద్ధాంతం చేయడానిక ప్రతిపక్షం సిద్ధంగా ఉంటాయి. మరి అలాంటి హోం మంత్రిగారు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. గత వారం కేంద్ర హోంశాఖవర్యులు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ... జేఎన్‌యూలో జరిగిన అల్లర్ల వెనుక ప్రముఖ తీవ్రవాది హఫీజ్ సయీద్ హస్తం ఉందని బాంబు పేల్చారు. దానికి సాక్ష్యంగా హఫీజ్ సయీద్ పేరుతో వచ్చిన ఒక ట్విట్టర్ మెసేజిని చూపారు. తరువాత ఆ ట్విట్టర్ ఖాతా హఫీజ్‌ది కాదని తేలడంతో నాలుక కరుచుకున్నారు. ఇంతలో జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోయింది.
అసలైన హఫీజ్ సయీద్ కూడా లైన్లోకి వచ్చి మన ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు.ఇలాంటి భంగపాట్లు రాజ్‌నాథ్‌కు కొత్త కాదు. ఈ ఏడాది మొదట్లో పఠాన్‌కోట్ మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఎవరు మర్చిపోగలరు. ఆ సందర్భంలో కూడా రాజ్‌నాథ్ సంచలన ప్రకటనలు చేసేందుకు తొందరపడ్డారు. తీవ్రవాదులు ఇంకా పఠాన్‌కోట స్థావరంలో ఉండగానే... వారిని తుదముట్టించేశామని జనవరి 2న ట్వీటారు. అంతేకాదు! ఈ దాడిలో అయిదుగురు తీవ్రవాదులు పాల్గొన్నారని మరోమారు ట్వీటారు. జనవరి 3న పఠాన్‌కోటలో తాజా కాల్పులు వినిపించడంతో తన పాత ట్వీట్లన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న జైష్-ఎ-మహమ్మద్ తీవ్రవాద సంస్థ ముఖ్యుడు మసూద్ అజార్ ‘అసలు తీవ్రవాదులు ఎందరో కూడా తెలుసుకోలేని అయోమయంలో వారున్నారు’ అంటూ రాజ్‌నాథ్‌ను పరోక్షంగా వెక్కిరించారు. ఇప్పటికైనా మంత్రివర్యులు ఏదన్నా ప్రకటన చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు. మరీ తీవ్రవాదులు కూడా మన హోంమంత్రిన ఎద్దేవా చేస్తుంటే వినడానికి బాగోదు కదా!


