టీఆర్ఎస్ లో కొత్త డౌట్స్.. హరీష్ రావుని పక్కన పెడుతున్నారా?

 

టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్ గా ఎంత పేరుందో.. పార్టీలో ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారని కూడా అంతే వార్తలు వినిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. హరీష్ రావు టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారని, ఏ క్షణంలోనైనా ఆయన టీఆర్ఎస్ ని వీడతారని విపక్షాలు ఆరోపణలు చేసాయి. కానీ అలాంటిదేం జరగలేదు. టీఆర్ఎస్ లోనే ఉన్నారు. సిద్ధిపేట నుంచి లక్షకు పైగా మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. అంతేనా రేవంత్ రెడ్డి, డి.కె అరుణ వంటి ఎందరో కాంగ్రెస్ సీనియర్ నేతలను హరీష్ రావు తన వ్యూహ చతురతతో మట్టి కరిపించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల తరువాత మళ్ళీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారం నిలిబెట్టుకుంది. కేసీఆర్ రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. అంతేనా జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయనకు మంత్రివర్గంలోనైనా చోటు దక్కుతుందా? అంటూ హరీష్ వర్గంలో ఆందోళన మొదలైంది. దీనికి తగ్గట్టే కేసీఆర్.. హరీష్ రావుని పార్లమెంట్ కి పంపాలని చూస్తున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే హరీష్ రావుని నిజంగానే రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం కేసిఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేసేందుకు సమీక్షలతో వేగం పెంచుతున్నారు. రెండు రోజులపాటు హెలిక్యాప్టర్ మీద కాళేశ్వరం సహా గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలియదిరిగారు. ఈ టూర్ లో కేసిఆర్ తో పాటు పలువురు అధికారులు, నేతలు ఉన్నారు. అయితే హరీష్ రావు మాత్రం మిస్ అయ్యారు. హరీష్ రావు మిస్ అవడం వెనుక కారణాలేంటని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కొందరైతే కావాలనే హరీష్ రావుని పక్కన పెడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ‘హరీష్ రావు మొన్నటి వరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రింబవళ్లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. రాత్రిపూట ప్రాజెక్టుల వద్దే నిద్రించి మంత్రుల పని తీరులో కొత్త ఒరవడి సృష్టించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఎక్కువ సమయం ప్రాజెక్టుల వద్దే ఉన్నారు. మరి అటువంటి నాయకుడు, సీఎం కేసిఆర్ ప్రాజెక్టుల టూర్ లో ఉండకపోవడం పెద్ద వెలితి కాదా? ’ అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు ఇంతకాలం భుజాన మోసినందున ఆయనను కూడా ఈ టూర్ లో ఇన్వాల్వ్ చేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేది కదా? అని కొందరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి హరీష్ రావును కేసిఆర్ ఈ టూర్ కు పిలవలేదా? లేదంటే పిలిచినా ఆయన రాలేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న వేగం కంటే హరీష్ రావుని పక్కన పెడుతున్న వేగమే ఎక్కువ' అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి. మరి ఈ అనుమానాలకు టీఆర్ఎస్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.