TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోవా, మణిపూర్‌లో బీజేపీ దొంగాట

Published on: Mon Mar 13, 2017 12:51PM

 

గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాల ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. అయితే గోవా, మణిపూర్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌... రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేసి తీరుతామని ప్రకటించింది.

 

40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలిస్తే, బీజేపీ 13 స్థానాలతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. అయితే గోవాలో కాంగ్రెస్‌ పార్టీ.... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అదే బీజేపీ.... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎనిమిదిమంది సభ్యులు కావాలి. అయితే బీజేపీ మిత్రపక్షాలైన గోవా ఫార్వార్డ్ బ్లాక్, ఎంజీపీ తలో 3 సీట్లు గెలుచుకున్నారు. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ కోసం ఇండిపెండెంట్లతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది.

 

అయితే గోవాలో ఓటమి పాలైన బీజేపీ, అడ్డదారిలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ మండిపడ్డారు. గోవాలో బీజేపీ నేతలు బేరసారాలకు దిగారన్న డిగ్గీ.... ఇదేనా మీ పార్టీ నైతికత అంటూ ప్రశ్నించారు. ఏదిఏమైనా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు తగిన సంఖ్యా బలముందన్న దిగ్విజయ్‌.... అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ కోసం బీజేపీయేతర ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

 

ఇక మణిపూర్‌లో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. 60 స్థానాలున్న మణిపూర్‌‌లో 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌.... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ముగ్గురు ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోసారి సీఎల్పీ నేతగా ఎన్నికైన మణిపూర్‌ ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌.... ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అయితే 21 సీట్లు గెలిచిన బీజేపీ.... ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరు మణిపూర్‌ పీఠం దక్కించుకుంటారోనన్నది ఉత్కంఠంగా మారింది.