TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోవాలో జిల్ జిల్ జిగా.. కొవిడ్‌కు గుల్ గుల్ గులా..! వీడియో వైర‌ల్‌..

Published on: Mon Jan 3, 2022 6:39PM

ఈ ఫోటో ఓసారి చూడండి. గోవాలో న్యూఇయ‌ర్‌కి స్వాగ‌తం చెప్పేందుకు ఇలా వీధిలో కిక్కిరిసిపోయి క‌నిపించారు టూరిస్టులు. గోవాలోని ప్ర‌సిద్ధ 'బాగా' బీచ్‌కి వెళ్లే దారిలోని దృశ్యం ఇది. ఆ వీధి వీధంతా ఇలా జ‌నాల‌తో నిండిపోయింది. న‌డ‌వ‌డానికి కూడా దారి లేనంత‌గా నిండిపోయింది. కార్లు, బైక్‌లు, ప్ర‌జ‌లు.. బాగా బీచ్‌లో 31st నైట్ అంతా జిల్ జిల్ జిగా.....

దేశంలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగాల్‌లో నైట్‌క‌ర్ఫ్యూ ఉంది. గోవాలో మాత్రం అంతా ఓపెన్‌. న్యూ ఇయ‌ర్‌కు దేశ ప్ర‌జ‌లంతా గోవాలో వాలిపోయారు. ఫ‌లితం.. ఇదిగో ఇలా పాపుల‌ర్ బీచుల‌న్నీ జ‌నంతో జాత‌ర‌ను త‌ల‌పించాయి. ప‌ర్యాట‌కులు పండగ చేసుకోవ‌డ‌మేమో కానీ.. ఇదే ఛాన్స్‌గా కొవిడ్ వైర‌స్ మాత్రం కుమ్మేసి ఉంటుంది. 

ఎవ‌రికీ మాస్కులు లేవు. సోష‌ల్ డిస్టెన్సింగ్ ఊసే లేదు. తోపులాట ఒక్క‌టే త‌క్కువ‌. అందుకే, ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. క‌ట్ చేస్తే.. 24 గంటల్లో గోవాలో 388 కొత్త కేసులు వచ్చాయి. అందులో ఒక‌టి ఒమిక్రాన్ కేసు. సోమవారం గోవాలో కొవిడ్ పాజిటివిటీ రేటు 10.7 శాతానికి పెరిగింది. అయితే, టూరిస్టులు అంతా న్యూ ఇయ‌ర్ త‌ర్వాత ఎవ‌రి ప్రాంతాల‌కు వాళ్లు వెళ్లిపోవ‌డంతో.. కేసుల సంఖ్య త‌క్కువగా క‌నిపిస్తోంది. అంద‌రికీ ప‌రీక్ష‌లు చేస్తే.. అస‌లు లెక్క వేరే ఉంటుంద‌ని అంటున్నారు. గోవాలో ఎవ‌రెవ‌రికి కొవిడ్ అంటుకుందో.. వారంతా వారి వారి రాష్ట్రాల‌కు వెళ్లి.. ఇంకా ఎవ‌రెవ‌రికి వైర‌స్ అంటిస్తున్నారో.. అనే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. వీళ్లంతా న్యూఇయ‌ర్‌ను కాకుండా.. కొవిడ్ వేవ్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెబుతున్నార‌ని పోస్టులు పెడుతున్నారు. ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. గోవా ప్ర‌భుత్వం ఈ స్థాయిలో ప‌ర్యాట‌కుల‌కు ఎలా అనుమ‌తించింద‌ని మండిప‌డుతున్నారు.