గల్లా తలుచుకుంటే వెంకట రమణ గెలుపు తథ్యం
Published on: Fri Jun 8, 2012 12:51PM
కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని మంత్రి గల్లా అరుణకుమారి ఇచ్చే పిలుపు తిరుపతి నియోజకవర్గంలో ఆ పార్టీకి 30వేల ఓటుబ్యాంకులనటిది. ఆమె పిలుపుతోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణ గెలుపు ఖాయం అని నియోజకవర్గ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే అరుణకుమారి భర్త రామచంద్రనాయుడు నెలకొల్పిన అమరరాజా బ్యాటరీస్ కు చెందిన ఉద్యోగులు 30 వేలకు పైచిలుకు తిరుపతిలోనే ఉన్నారు. వీరంతా ఆమె పిలుపును విని అనుసరిస్తే చాలు. కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకే. తన కుమారుడు జయదేవ్ కు టిక్కెట్టు ఇవ్వలేదని అలిగిన ఆమె తన కంపెనీ ఉద్యోగులకు ఎటువంటి సంకేతాలూ ఇవ్వలేదు. అయితే కడపజిల్లా రైల్వేకోడూరులో మాత్రం ఆమె తమ కంపెనీ ఉద్యోగులను, సన్నిహితులను కాంగ్రెస్ కు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఇక్కడ కూడా ఆమె మాట చెల్లుతుంది. అందుకనే రైల్వేకోడూరు నియోజకవర్గంపై అరుణకుమారి ఎక్కువగా దృష్టిసారించారు. ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవిస్తున్న ఆమె తిరుపతి అభ్యర్థి వెంకటరమణను గెలిపించాలని సిఎం ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆయన ముందుగానే పరిస్థితిని అంచనా వేసి ఇటీవల జాతీయనేతల కార్యక్రమానికి అరుణకుమారిని తిరుపతి రప్పించారు. ఆమెకు మైకు ఇప్పించి కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఓటు అభ్యర్థించమన్నారు. ఆయన ముందు ఓటు అభ్యర్థించినా అమర రాజా ఉద్యోగులకు మాత్రం ఓటెయ్యాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సిఎం ప్రత్యేకించి అమరరాజా ఉద్యోగులను ఓటు కోరాలని ఆమెపై మరింత ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. సిఎం గురించి అయినా గల్లా మనస్సు మార్చుకుంటారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ నేతలు భావిస్తున్నారు.


