TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈనాడుపై వైయస్ కక్ష కట్టారు: విహెచ్

Published on: Fri May 11, 2012 12:49PM

సాక్షి ఖాతాల స్తంభనన పత్రిక స్వేచ్ఛతో ముడిపెట్టవద్దని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురువారం న్యూఢిల్లీలో అన్నారు. సూర్య పత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశ్ రావును జైల్లో పెట్టినప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల సంక్షేమం గురించి ఈ పాత్రికేయ సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. జీతాలు రాని పరిస్థితి వస్తే ఉద్యోగులు యాజమాన్యాన్ని నిలదీయాలి తప్పితే రోడ్ల మీదకొచ్చి రాజకీయ నినాదాలు చేయడం ఏమిటన్నారు. జగన్‌కు ఏమీ కాకుండానే రోడ్ల మీదకొచ్చి రంకెలేస్తున్నారన్నారు. నూకారపును అరెస్ట్ చేసినప్పుడు సూర్య ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రశ్నించారా అన్నారు.


 

ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చదవవద్దని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చినప్పుడు పాత్రికేయ సంఘాలు ఎందుకు స్పందించలేదన్నారు. ఖాతాలు స్తంభింప చేస్తేనే పత్రిక స్వేచ్ఛను హరించి వేసినట్లా అని ప్రశ్నించారు. మార్గదర్శిని మూసేయించి ఈనాడును దెబ్బకొట్టాలని వైయస్ ప్రయత్నించినప్పుడు నాయకులెవ్వరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సాక్షి అవినీతిని వ్యతిరేకించినా... సాక్షి ఉద్యోగుల ఆందోళనకు కవరేజి ఇచ్చాయన్నారు. మార్గదర్శిపై ఉండవల్లి కేసు వేసినా ఆయన ప్రకటనలనూ ఈనాడు ప్రచురించిందన్నారు. కానీ సాక్షి మాత్రం ఎదుటివారిపై బురదజల్లడాన్ని పనిగా పెట్టుకుందన్నారు. వైయస్ పాదయాత్రకు ఈనాడు ఇచ్చినంత కవరేజ్ ఏ పత్రికా ఇవ్వలేదన్నారు. అలాంటి పత్రిక పైనే తర్వాత ఆయన కక్ష కట్టారన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అవినీతిపైన దాడే తప్ప పత్రికా స్వేచ్ఛ పైన కాదన్నారు.