TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారతీయ విద్యార్థులు తెలివైనవారు... ట్రంప్!

Published on: Tue Mar 15, 2016 3:57PM

ఈ విషయాన్ని ఇదివరకు చాలామందే చెప్పి ఉంటారు. కానీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్ నుంచి కూడా ఇదే మాట రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే అంశమే. ఎందుకంటే ట్రంప్ నోటి వెంట ఎప్పుడు విదేశీయుల గురించి తిట్లూ, శాపనార్థాలే వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ చైనా వంటి దేశాలన్నా, ఆ దేశ పౌరులన్నా ట్రంప్‌ మండిపడుతూ ఉంటారు. కానీ ట్రంప్‌గారికి ఏదో ఓ మూల మన దేశమంటే కాస్త సదభిప్రాయం ఉన్నట్లుంది. అందుకే భారత్‌ చాలా అద్భుతంగా రాణిస్తోందని మొన్నామధ్య ప్రశంసలు కురిపించారు కూడా. కానీ అంతలోనే భారతదేశం H1B వీసాల ద్వారా తమ దేశంలోని ఉద్యోగుల కడుపు కొడుతోందంటూ మండిపడ్డారు.

ఇంతకీ అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయుల గురించి, ట్రంప్‌గారి ఉద్దేశం ఏమిటా అని ఓ ముఖాముఖి కార్యక్రమంలో అడిగితే ‘అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుకునే భారతీయ విద్యార్థులు చాలా తెలివైనవారనీ, తమ తరగతులలో వాళ్ల ఎప్పుడూ ముందుంటారనీ’ అని ముందు పొగిడారు. అలాంటి ప్రతిభావంతులు తమ దేశానికి చాలా అవసరమన్నారు ట్రంప్‌. ఏళ్ల తరబడి అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుకున్నవారిని, చదువు పూర్తికాగానే వెళ్లిపొమ్మనడం దేశానికే నష్టమని చెప్పుకొచ్చారు. అలాంటివారు అమెరికాలోనే స్థిరపడాలనుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు. అంటే అమెరికాలోనే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తే ట్రంప్‌గారికి ఏమాత్రం అభ్యంతరం లేదన్నమాట.