బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’
Published on: Mon Jan 10, 2022 10:15AM
ఒక వైపున కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇంకో పక్కన డెల్టా వేరియంట్ కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. మరో వైపున ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇవన్నీ చాలవు అన్నట్లు ఇప్పుడు జనం నెత్తిన మరో పిడుగు లాంటి వార్త వచ్చిపడింది. డెల్టా + ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాలతో సరికొత్తగా మరో వైరస్ బయటపడింది. దీనికి వైద్య నిపుణులు ‘డెల్టాక్రాన్’ అనే పేరు పెట్టారు. సైప్రస్ ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసింది. డెల్టాక్రాన్ వైరస్ ను సైప్రస్ లోని వైరాలజీ నిపుణుడు ఒకరు గుర్తించారు. అయితే.. తాజాగా కనిపించి డెల్టాక్రాన్ వైరస్ ప్రభావం ప్రజలపై ఏ మేరకు ఉంటుందనే విషయం ఇప్పటికిప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సైప్రస్ లో సేకరించిన నమూనాల్లో డెల్టా- ఒమిక్రాన్ వేరియంట్లకు సంబంధించిన 10 మ్యుటేషన్లు గుర్తించినట్లు సమాచారం వస్తోంది. కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ అయిన కొందరి నుంచి, సాధారణ ప్రజల నుంచి కొన్ని నమూనాలు సేకరించిన తర్వాత డెల్టాక్రాన్ వేరియంట్ ను కనుగొన్నారట. డెల్టాక్రాన్ మ్యుటేషన్ల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ వేరియంట్ ను గుర్తించిన సైప్రస్ విశ్వవిద్యాలయం వైరాజలీ నిపుణుడు డాక్టర్ లియోండస్ కోస్టిక్రిస్ వెల్లడించారు. అయితే.. కొత్త వేరియంట్ డెల్టాక్రాన్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతుండడం కాస్త గుడ్డిలో మెల్ల అని చెప్పొచ్చు.


