Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీ పోరాటాల హోరు.. నింపేనా కాంగ్రెస్ లో జోరు?
posted on: Jul 23, 2026 2:50PM

హస్తిన వేదికగా రగులుతున్న ఆందోళనలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా సరైన రాజకీయ ప్రాధాన్యత కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ నిరసన జ్వాలలు అందివచ్చిన అవకాశంగా మారాయి. నీట్ అక్రమాలపై విద్యార్థి లోకం చేపట్టిన పోరాటం ఉథృతమై కేంద్రానికి సవాల్ గా మారింది. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ మూడు దఫాలలోనూ ఈ స్థాయిలో నిరసనలు ఎన్నడూ ఎదుర్కొన్న పరిస్థితి లేదు. ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పోరాటంలో రాహుల్ గాంధీ దూకుడు, ప్రసంగం ఆయనలో గతంలో ఎన్నడూ చూడని కొత్త ఫైర్ కనిపించేలా చేశాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. విద్యార్థి సమాజం చేపట్టిన ఈ ఆందోళనకు తోడుగా, పంజాబ్ రైతులు కూడా ఢిల్లీకి తరలి రావడం ఉద్యమానికి ఊపు తీసుకురావడమే కాకుండా, కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పంజాబ్ రైతాంగం, ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తూ విద్యార్థుల నిరసనలకు పూర్తి మద్దతు ప్రకటించింది.
ఒకే వేదికపైకి విద్యార్థుల సమస్యలు, రైతాంగ ఆవేదన వచ్చి చేరడంతో నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, పారదర్శకతా లోపంపై దేశవ్యాప్తంగా యువత ఆగ్రహంతో రగిలిపోతుంటే.. వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఇండియా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం రైతులు సైతం వీధుల్లోకి రాక తప్పని పరిస్థితిని తీసుకువచ్చింది. కర్షకులు, జెన్ జెడ్ కలయిక కేంద్రానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది.
ఈ పరిణామాలను కాంగ్రెస్ రాజకీయ అవకాశంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి తన నాయకత్వ పటిమను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిరసన ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా భాగస్వామి కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పరిశీలకులు కూడా జాప్యం అయినా రాహుల్ ప్రత్యక్షంగా ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు. నిరసనకారుల వేదికపై నిలబడి రాహుల్ చేసిన ఘాటు విమర్శలు, కేంద్ర విధానాలను ప్రశ్నించిన తీరు ప్రజాబాహుల్యాన్ని మొప్పించింది.
ప్రస్తుత నీట్ వివాదం, రైతు నిరసనల కలయిక కాంగ్రెస్‌కు బలమైన వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నికాంగ్రెస్ క్షేత్రస్థాయి నుంచి ఎంత ప్రభావమంతంగా వాడుకుంటుందన్నదానిపైనే ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది.
ప్రస్తుతానికి ఈ ఆందోళనలు, ధర్నాలు ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికే పరిమితమై ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీ బలీయమైన పరిపాలనా యంత్రాంగానికి ఢిల్లీ పరిధిలో ఇటువంటి ఆందోళనలను అదుపు చేయడం అంత సంక్లిష్టమైన విషయమేమీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందున్న అసలైన సవాలు ఈ ఆందోళనలను హస్తినకే పరిమితం చేయకుండా, దేశం నలుమూలలకూ విస్తరింపజేయడమే. దేశవ్యాప్తంగా విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలలో ఈ భావజాలాన్ని బలంగా తీసుకెళ్లగలిగితేనే కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
రాబోయే ఎన్నికల నాటికి ఈ ప్రజాగ్రహాన్ని ఓట్లుగా మలచడం కాంగ్రెస్ నాయకత్వానికి నిజమైన సవాలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, దానిని నిలకడైన వ్యూహంతో ముందుకు తీసుకెళ్లగలిగితేనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం లభించే అవకాశం ఉంటుంది.
Congress Protests, Rahul Gandhi Modi Residence, NEET Exam Controversy, Punjab Farmers Delhi March, India US Trade Agreement





