కిరణ్ కు పదవీ గండం తప్పదా?
Published on: Fri Jun 15, 2012 1:40PM
ఉపఎన్నికల ఫలితాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాల్లోనైనా గెలుస్తామనే ధీమాతో కిరణ్ తో పాటు కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడమే కాకుండా కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలబడడం, డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులను వినియోగించింది. మెరుగైన ఫలితాల కోసం వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి అతిరథ మహారథులు ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రులందరూ ఎన్నికల బాధ్యతను మోశారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జగన్ ను రాజకీయంగా పాతర వేయడమనే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోరాడింది. కిరణ్ కుమారైతే గొంతుచించుకుని మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని ఊరూరా ప్రచారం చేశారు. కొన్ని చోట్ల జగన్ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎలాగోలా కనీసం ఐదారు స్థానాలు కైవసం చేసుకోవాలన్న కిరణ్ కుమార్ ఎత్తుగడలు విఫలమయ్యాయి. రాజీవ్ యువకిరణాలు, మహిళలకు రుణాలు వంటి సంక్షేమ పథకాలను ఎన్నికల సభల్లో చెప్పినప్పటికీ ఓటర్లు ఆలకించలేదు. దీంతో జగన్ అవినీతిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ వ్యూహం కూడా బెడిసికొట్టి ఓటమి పాలవడంతో కిరణ్ అధిష్టానం దృష్టిలో చులకనైపోయారు. జగన్ పార్టీ విఅజయంతో కాంగ్రెస్ లో కుమ్ములాటలు మరింత ముదురుతాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ లో కొనసాగితే తమకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే అనుమానంతో చాలామంది శాసన సభ్యులు, కొందరు మంత్రులు కూడా ఉన్నారు. వీరిని కంట్రోల్ చేయలేకపోతే కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి ఊడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు జగన్ పంచన చేరితే కిరణ్ సర్కార్ పతనమైపోతుంది. ఎలా చూసినా మరో కొద్ది నెలల్లో కిరణ్ కుమార్ రెడ్డికి పదవీగండం ఖాయంగా కనిపిస్తోంది.


