సిఎంతో సబితేమి మాట్లాడారు?
Published on: Fri Jun 8, 2012 12:08PM
ఒకవైపు ఎన్నికలు, మరోవైపు సిబీఐ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు రాష్ట్రాన్ని సంచలనాలకు వేదికగా మార్చాయి. ఈ సంచలనాలకు తోడు సిబీఐ జగన్ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న మంత్రులను కూడా తాజాగా పిలిపిస్తోంది. ఇప్పటి వరకూ రాజీనామా చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, తాజాగా పొన్నాల లక్ష్మయ్యలను సిబీఐ విచారించింది. తరువాత దశలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి తదితరులను సిబీఐ విచారించనుంది. దీంతో మిగిలిన మంత్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ టెన్షన్ భరించలేమనుకున్నారో ఏమో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో రెండుగంటల పాటు చర్చించారు. అసలు ఆమె ఏ విషయంపై సిఎం తో మాట్లాడారు అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ అవుతోంది. తనను రక్షించమని కోరారా? లేక కేసులో మంత్రులను మినహాయించకపొతే ఎదురయ్యే పరిణామాలు వివరించారా? అన్న విషయం ఇంకా తేలలేదు. ఆమె కానీ, సిఎం కానీ నేరుగా చెబితేనే అసలు ఆ చర్చ దేనికోసమో తేలుతుంది. అయితే ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారి సిబీఐ దృష్టికి కూడా వెళ్ళింది.


