'చిరు' ప్రచారాన్ని వద్దంటున్న కాంగ్రెస్ అభ్యర్థులు?
Published on: Sat Jun 2, 2012 9:56AM
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య వార్తల్లో పెద్దగా కనిపించటం లేదు. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటరీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచార బాధ్యతా తీసుకున్న ఆయన ఇటీవల తన సామాజికవర్గ ఓటర్లకు దూరమయ్యారని ప్రచారం జరిగింది. పీఆర్పీని విలీనం చేయటం తమలో అత్యధికులకు ఇష్టం లేదని ఆ సామాహికవర్గ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో ఆయన ప్రచారం కోసం వచ్చి సాధించేది ఏముందని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అభ్యర్థులు ప్రశ్నించారట. అలానే ఆయనను ప్రచారం కోసం పంపవద్దని కొందరు అధిష్టానాన్ని కోరుతున్నారట. ఈ సమాచారం చిరంజీవికి కూడా తెలియటంతో ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో తన షెడ్యూలు ఖరారైనా మౌనముద్రను దాల్చారు. కాపువర్గ విశ్వసనీయతను కోల్పోయాక ఆయన ప్రచారంలోకి వచ్చి ఏమి చేస్తారని ప్రశ్నించిన అభ్యర్థుల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అభ్యర్థి, పీఆర్పీ మాజీ నేత తోట త్రిమూర్తులు పేరు కూడా వినిపించింది. తనకున్న పట్టు కూడా సామాజికవర్గంలో ఆయనకు లేదని తోట అభిప్రాయపడ్డారని తెలుస్తోంది ఈ విషయం తెలిసిన తరువాత చిరంజీవి షాకయ్యారట. 18 శాతం ఓటింగ్ సాధించిన పీఆర్పీ అధ్యక్షునిగా చిరంజీవి తమకు ఉపయోగపడతాడని భావిస్తే ఆయన వల్ల తమకు నష్టం జరుగుతోందని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. జాతీయస్థాయికి ఆయనకు అవకాశం కల్పిస్తే ఇటీవల అనంతపురంలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు కూడా పెట్టారని చిరుపై వారు చిర్రుబుర్రులాడుతున్నారట. ఏమైనా చిరంజీవి తన సామాజికవర్గానికీ, ప్రత్యేకించి పీఆర్పీ నేతలకూ దూరమయ్యారని తేలుతోంది.


