దేవినేనికి గుడివాడ టికెట్.. టీడీపీ నేతల ఫైర్

 

గుడివాడ అసెంబ్లీ నుండి టీడీపీ తరపున దేవినేని అవినాష్ బరిలోకి దిగుతాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ వార్తలే నిజమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవినాష్ ను ఖరారు చేసారు. అవినాష్‌ ఇప్పటికే నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మున్సి పల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీలను కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. సామాజిక వర్గాల వారీగా నాయకులను కలుస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు.

మరోవైపు.. గుడివాడ టికెట్‌ దేవినేని అవినాష్‌కు కేటాయించడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుడివాడ టికెట్‌ రావి వెంకటేశ్వరరావుకే ఇవ్వాలని నియోజకవర్గ టీడీపీ కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు. శోభనా కాన్ఫరెన్స్‌హాలులో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. తొలుత రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉందామని, ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరం కలసి పనిచేద్దామని కోరారు. దీంతో కొంత మంది నాయకులు టికెట్‌ రావికి ఇవ్వని పక్షంలో పార్టీ పదవులకు రాజీనామా చేసి సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. మరికొంత మంది స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ కొనకళ్ల నారాయణను కలసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. మరి స్థానిక శ్రేణుల్లో ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చి, ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నానికి అవినాష్ ఎలా చెక్ పెడతారో చూడాలి మరి.