మీ పప్పులు నా దగ్గర ఉడకవు..

 

మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి బిస్కట్ ఇవ్వాలని చూస్తుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే...ఏపీకి ఇక ఇచ్చేది ఏం లేదు... ఈ విషయంపై చర్చించడం కూడా ఇక అనవసరం అని ఇప్పటికే వెంకయ్యనాయుడి దగ్గర అన్నట్టు వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చర్చల నిమిత్తం ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్టు సమాచారం. విభజన హామీలపై చర్చించేందుకు ఈనెల 5న ఢిల్లీ రావాలని కోరారట. అయితే ఒక్కసారి మోసపోతారు.. అలా అని పదే పదే మోసం చేయలేరు కదా.. అందులో అపర చాణుక్యుడు చంద్రబాబుని. అందుకే చంద్రబాబు తెలివిగా... నేను రాను.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులను చర్చలకు పంపిస్తా అని చెప్పారట. అంతేకాదు... హోదా విషయంలో  పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని... పార్లమెంట్ లో తప్పనిసరిగా పట్టుబడతామని... ఎవరు ఎన్ని ఫోన్లు చేసినా తమకు రావాల్సిన హక్కులు వచ్చే వరకు పోరాటం ఆపమని తేల్చి చెప్పారట.

 

మరి ఏపీకి ఇచ్చేది ఏం లేదని చెప్పిన అమిత్ షా మళ్లీ ఎందుకు ఫోన్ చేసినట్టో.. దానికి కారణం లేకపోలేదు... కేంద్ర తీరుపై విసుగెత్తిపోయిన చంద్రబాబు బీజేపీపై జాతీయ స్థాయి పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా.. దేశంలోని అన్నిజాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాయాలని... అందులో విభజన చట్టం హామీలు, కేంద్రం నుండి వచ్చిన నిధులు, హోదా ప్యాకేజీ మతలబును గురించి పూర్తిగా వివరించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే పొగరుతో ఎగిరిపడిన అమితిషా ఈ నిర్ణయాల గురించి తెలుసుకొని ఫోన్ చేశారు పాపం. తమకు ఇష్టమొచ్చినప్పుడు బుజ్జగించడం.. లేకపోతే పోతే పోండి అని అనేయడం.. బీజేపీకి బాగా అలవాటైపోయింది. అంతేకాదు.. పదే పదే చర్చల పేరుతో పిలిచి... విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం... ఎటూ తేల్చకపోవడం గత కొద్ది రోజులుగా అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకే చంద్రబాబు కూడా వారి వేసే బిస్కట్లకు పడకుండా..చాలా తెలివిగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి వారికే అన్ని తెలివితేటలు ఉంటే.. రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబుకు ఎన్ని తెలివితేటలు ఉండాలి...