TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కళ, కార్టూన్‌కు ప్రోత్సాహమే సమాజ బాధ్యత : కేటీఆర్

Published on: Sun Jul 19, 2026 3:54PM

 

ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ పురస్కారాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాజకీయ జీవితంలో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శల మధ్య కొనసాగే తమకు ఇలాంటి సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు ఉద్యమ స్ఫూర్తిని, పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయని చెప్పారు.

కార్టూనిస్టుల పాత్ర గురించి ప్రస్తావిస్తూ... "ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం" అనే సూక్తిని ఉటంకించారు. సమాజం, రాజకీయాలపై కార్టూన్ల ప్రభావం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. భారతదేశంలో ఆర్.కే. లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను కేటీఆర్ ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని అన్నారు.

జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు అవసరమని, ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని అన్నారు. శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు గత ఆరేళ్లుగా ఆయన స్మారకార్థం ఈ అవార్డులను నిర్వహిస్తూ కార్టూన్, చిత్రకళ రంగాల్లో విశిష్ట సేవలందించిన కళాకారులను సత్కరిస్తుండటాన్ని కేటీఆర్ అభినందించారు.

 cartoonist Shekhar, Somajiguda,Press Club, Shekhar Memorial Awards, KTR, Painter Kurella Srinivas