TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బర్లీ డ్యామ్ లో పడవ మునిగి ఏడుగురు మృతి

Published on: Fri May 1, 2026 9:03AM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో   విషాదకర ఘటన చోటుచేసుకుంది. నర్మదా నదిపై ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బర్గి డ్యామ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో   ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు   40 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం చోటుచేసుకుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల భారీ ఈదురుగాలులు వీచడంతో పడవ నియంత్రణ కోల్పోయి నదిలో మునిగిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తుండగానే క్షణాల్లో పడవ నీటిలో మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్  ) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారిలో 16 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. అయితే.. గాలి వేగం ఎక్కువగా ఉండటం,  చీకటి పడటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.  గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.

ఈ  ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.  

ప్రాథమిక విచారణ ప్రకారం.. పడవలో సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించడం,  సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి స్పష్టం చేశారు.