బీజేపీకి కీలక నేతలు గుడ్ బై.. వైసీపీలోకి పురంధేశ్వరి!!

 

'మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది' ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి. అసలే ఏపీలో పార్టీ అంతంతమాత్రం అంటే.. ఇప్పుడున్న కొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన బాటలోనే మరికొందరు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో విష్ణుకుమార్‌రాజు, పురంధేశ్వరి వంటి కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది మాత్రం కోడ్ వచ్చాక చెబుతానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని అన్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడారని తెలిపారు.

గత కొంత కాలం నుంచి విష్ణుకుమార్ రాజు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయంపై మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొద్ది నెలలుగా పార్టీ సమావేశాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లా యంత్రాంగం నిర్వహించే సభలు, సమావేశాలకు మాత్రం హజరవుతున్నారు. బీజేపీ పక్షనేతగా రాష్ట్రంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఒత్తిడికి లోనవుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన బీజేపీని వీడటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
 
అదేవిధంగా సీనియర్ మహిళా నాయకురాలు పురంధేశ్వరి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే, తనకు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. కుమారుడికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా.. ఆమెకు ఎంపీ టికెట్‌పై స్పష్టత రాలేదని తెలుస్తోంది. టికెట్ పై స్పష్టత వస్తే ఆమె త్వరలోనే వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.