బాబు వ్యూహం: లోక్ సభకు బాలయ్య!

 

Balakrishna to contest for Lok Sabha, chandrababu lok sabha elections, Balakrishna tdp, telangana state

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సమయం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ పరిశీలన జరుపుతున్నారు. కొన్ని సీట్లలో ఆసక్తికరమైన పేర్లు కూడా ఆ పార్టీ పరిశీలనలో ఉన్నాయి.

 

బాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.గత ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకొంది. సంప్రదాయకంగా టీడీపీకి బలమైన ఈ సీట్లో బాలయ్యను నిలపాలన్నది అధినాయకత్వ యోచన. అక్కడ కాని పక్షంలో విజయవాడ సీటుకు కూడా బాలయ్య పేరును పరిశీలించే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా లోక్‌సభకు పోటీచేసే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.



2014 ఎన్నికలలో బిజెపి, తెలుగుదేశంలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే గెలుపు ఖాయమని బిజెపి, టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే చంద్రబాబు ఎంపీగా వెళ్లి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని, ఆ హోదాలో రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఆయన పార్టీకి ఇమేజ్‌ పెంచి, వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేస్తారని అంటున్నారు. ఇటీవల బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సైతం నారా చంద్రబాబు నాయుడును జాతీయ రాజకీయాలలోకి ఆహ్వానించిన సంగతి విదితమే. ఆ క్రమంలోనే చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని భావిస్తున్నారు.