ఆర్థరైటిస్ మందులతో అందమైన జుట్టు

 

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనేది సామెత. వైద్య శాస్త్రంలో అనేక వింతలు జరుగుతూ వుంటాయి. అలాంటి వింత విషయం ఈమధ్య కొంతమంది అమెరికాకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా మిగలకుండా రాలిపోయే వ్యాధికి గురైన వారికి ఇంతవరకు వైద్య శాస్త్రంలో ట్రీట్‌మెంట్ లేదు. అలాంటి వారు ఇప్పటి వరకూ ఒంటిమీద వెంట్రుకలు లేకుండా జీవించడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయేది. అయితే అలాంటి వ్యాధిగ్రస్తులకు అమెరికా శాస్త్రవేత్తలు మందును కనుగొన్నారు. ఆ మందు మరేదో కాదు.. కీళ్ళనొప్పుల నివారణకు వాడే మందునే ఒక క్రమ పద్ధతిలో వాడటం వల్ల ఒంటిమీద మళ్ళీ జుట్టు మొలిచే అవకాశం చాలా వుందట. దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా వాళ్ళు చేశారు. ఈ వ్యాధికి సంబంధించిన రోగులను ఎంపిక చేసుకుని వారి మీద ఆర్థరైటిస్‌కి సంబంధించిన మందుల్ని ఒక క్రమపద్ధతిలో ఇచ్చారు. ఆశ్చర్యకరంగా వారందరిలో జుట్టుపెరుగుదల కనిపించింది. జీవితంలో దువ్వెన వాడే అవకాశం లేదని బాధపడుతున్న వారందరూ ఇప్పుడు తమ జేబుల్లో దువ్వెనలు మెయిటెయిన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా జుట్టు రాలిపోయే వ్యాధితోపాటు బట్టతల నివారణకు కూడా సరైన మందులు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.