బాబుని టార్గెట్ చేయడానికి జగన్ కి మరో దారి ?

 

అభివృద్ధిని సైతం పక్కన పెట్టి గత ప్రభుత్వ అవినీతి మీదే ఫోకస్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబును కార్నర్ చేసే మరో విషయాన్ని వెలికి తీశారు. అదేంటంటే సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్ వ్యవహారం. టీడీపీ సర్కార్ గతంలో  జారీ చేసిన ఈ చెక్కులు అది కూడా తొమ్మిది వేలకు పైగా చెక్కులు బౌన్స్ కావడంతో ఈ సాకు చూపి బాబును కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 9వేలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ఎలా అయినా వోట్లు గుద్దించుకునే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఖజానాల నుండి సొమ్ము తరలించారని ఆరోపణలు వైసీపీ చేస్తోంది. వ్యవసాయ శాఖలో విత్తనాల కొరతకు కారణం , కొనుగోలు చెయ్యకపోవటం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవటమేనని వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు ఆరోపణలు చేసినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు. 

కానీ ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ల వ్యవహారం మాత్రం కలకలం రేపుతోంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ నిధులు కేటాయించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరిందే తడవుగా చెక్కులు జారీ అయ్యేవి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెట్టిన కొన్ని అనవసర పధకాల వలన నిధుల మళ్లింపు జరిగినదని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. 9 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అవగా ఆ అయ్యిన వాటి విలువ 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారట జగన్.