ఎస్‌ఈసీ ఆఫీసుకు ద్వివేది, గిరిజా శంకర్ పరుగులు ! ఆన్ లైన్ నామినేషన్లపై నిమ్మగడ్డకు వివరణ
Published on: Mon Feb 1, 2021 12:10PM
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో దూకుడుగా ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీ సర్కార్ కు చుక్కలు చూపిస్తున్నారు. తమ ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలకు దిగుతున్నారు. దీంతో ఇంతకాలం ప్రభుత్వం కనుసన్నల్లో నిమ్మగడ్డ ఆదేశాలను లైట్ తీసుకున్న అధికారుల గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా మరో ఏపీ సర్కార్ కు మరో షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా ఎందుకు స్వీకరించలేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పంచాయతీరాజ్ శాఖను నిలదీశారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ ఈరోజు ఉదయం హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఎస్‌ఈసీ కార్యాలయానికి హడావిడిగా చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్ లైన్ లో స్వీకరించే విషయంపై ఎస్ఈసి ని కలిసి వివరణ ఇవ్వనున్నారు.
గత మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కొందరు అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు చించివేయడం, అలాగే నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఘటనలు జరగడంతో పలు రాజకీయ పార్టీలు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని అప్పట్లో ఎస్‌ఈసీని అభ్యర్థించాయి. దీంతో ఇక నుండి ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీరాజ్‌శాఖను ఎస్‌ఈసీ ఆదేశించారు.
అయినా పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్లను మాత్రం ఆన్ లైన్ ద్వారా కాకుండా వ్యక్తిగతంగానే స్వీకరించారు. అయితే ఈ ప్రక్రియలో కూడా పలు గ్రామాల్లో అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్న వ్యవహారం పై మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. మరోపక్క పలు పొలిటికల్ పార్టీలు గతంలోనే తాము ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ పై చేసిన అభ్యర్ధన గురించి ఎస్‌ఈసీకి మరోసారి గుర్తుచేశాయి. దీంతో ఎన్నికల సంఘం స్పందించి.. ఉన్నతాధికారులు ద్వివేది, గిరిజా శంకర్‌కు నోటీసులిచ్చింది.


