ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్.. ఏపీ సీఎస్ వ్యాఖ్యలు

 

ఏపీ సచివాలయంలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. సివిల్ సర్వీస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేసారు. మనం ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే అని అన్నారు. ఎవరు రెచ్చిగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని అన్నారు. అలా ఉద్యోగం పొగొట్టుకున్న వారి గురించి తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. నిజాయితీ, హుందాగా ఉండటం తన బాధ్యత అని చెప్పిన ఆయన.. అధికారులకు రోల్ మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉందని తెలిపారు. ఇక బ్లాక్ 2లో ఉద్యోగమైనా బ్లాక్ 1లో ఉద్యోగమైనా ఒకటే అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బ్లాక్ 1లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అక్కడ పనిచేసే అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే భావన అధికారవర్గాల్లో కనిపిస్తుంటుంది. అయితే ఎక్కడ పనిచేసే అధికారులైనా ఒక్కటే అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పరోక్షంగా సమాధానం ఇచ్చారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.