శాసనసభ 17వ తేదీకి వాయిదా

 

 

 

శాసనసభ సమావేశాలు ఈనెల 17వ తేదీకి వాయిదా పడ్డాయి. విభజన బిల్లుపై సభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రసంగం అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను వాయిదా వేశారు.శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌నాదెండ్ల మనోహర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.

 

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభంకాగానే తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి హమీ రాలేదని నిరసిస్తూ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీనిపై ఆ పార్టీ శాసనసభపక్ష నేత వైఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ మెజార్టీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తున్నారని, అన్ని క్లాజులను వ్యతిరేకిస్తూ సవరణలు పంపామన్నారు. ప్రధాన అంశాలపై బిల్లులో సమాచారం లేదని విజయమ్మ తెలిపారు. విజయమ్మ వ్యాఖ్యలపై స్పీకర్ మనోహర్ వివరణ ఇచ్చారు. టి.బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందన్నారు. చర్చ జరగకముందే ఓటింగ్ కోరడం సరికాదని తెలిపారు.