TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి భూసమీకరణ రగడ.. ఉండవల్లి రైతుల ఆవేదన!

Published on: Fri May 29, 2026 9:02AM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజధానికి ప్రధాన ముఖద్వారంగా నిలిచే ఉండవల్లి గ్రామంలో రెండో విడత భూసమీకరణ  ఇప్పుడు ఒక అడుగు ముందుకు, మూడడుగులు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. 2015లో 29 గ్రామాల పరిధిలో సుమారు 34,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరిస్తూ..  ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించింది. ఆ సమయంలో దాదాపు 99 శాతం మంది రైతులు భవిష్యత్తుపై   ఆశలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే..  మిగిలిన 1 శాతం భూమికి సంబంధించిన సమస్య లు, ముఖ్యంగా ఉండవల్లి గ్రామంలోని పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి.

ఉండవల్లి గ్రామ పరిధిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం 3 కిలోమీటర్ల పొడవునా భూములు ఇవ్వడానికి సుమారు 42 మంది రైతులు మొదట్లో అంగీకరించారు. సిఆర్డిఏ అధికారులు, అప్పటి మంత్రులు కేవలం రోడ్డు నిర్మాణం వరకే భూములు తీసుకుంటామని, మిగిలిన భూముల జోలికి రాబోమని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ సొంత భూములను త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఆ తర్వాత కాలంలో అధికారులు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ..  రోడ్డు ఇరువైపులా అదనంగా 15 మీటర్ల నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్,  గ్రీన్ జోన్ కోసం నోటిఫికేషన్లు జారీ చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ అదనపు నిబంధనల వల్ల ఉండవల్లి పరిధిలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలోని వివిధ సర్వే నెంబర్ల భూములు భూసమీకరణ పరిధిలోకి వచ్చే ప్రమాదం ఏర్పడింది.

ఉండవల్లి గ్రామం భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైనది. ఒకవైపు కొండలు, మరోవైపు కృష్ణా నది, ఇంకోవైపు కొండవీటి వాగు ప్రవాహంతో కూడిన చాలా చిన్న మరియు  ప్రాంతం ఇది. ఇక్కడి భూముల్లో కేవలం 20 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు పడుతుంది. ఈ కారణంగానే ఏడాది పొడవునా..  అంటే 365 రోజులూ ఇక్కడ భూములు ఆకుపచ్చదనంలో కళకళలాడుతూ ఉంటాయి. ఈ గ్రామంలో మెజారిటీ ప్రజలు ఒకటి లేదా రెండు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే. తెల్లవారుజామున లేచింది మొదలు కరకట్ట కింద, నది పరివాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకుంటూ రోజూ  500 నుండి  1000 రూపాయల వరకు సంపాదించుకుంటూ జీవించే సాధారణ కుటుంబాలు వీరివి. తమకు అద్దాల మేడలు, మెరుగులు అవసరం లేదని, తరతరాలుగా వస్తున్న మట్టి వాసన, వ్యవసాయమే  జీవనాధారమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం కనీసం 12 నుండి 15 సెంట్ల భూమి లేకపోతే సరైన వాణిజ్య ప్లాట్లు కూడా దక్కవని, దీనివల్ల తాము పూర్తిగా రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్య తీవ్రతరం కావడానికి అధికారుల అలసత్వం, సమన్వయ లోపమే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు రాజధానుల వివాదం తర్వాత అమరావతిలో పనులు మళ్లీ వేగం పుంజుకోవడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌లతో కూడిన త్రీ మెన్ కమిటీ ఎంతో శ్రమించింది. ఆ కమిటీ స్పష్టమైన గణాంకాలను  ప్రజల ముందు ఉంచి..  కేవలం 300 ఎకరాల పరిధిలోనే సాంకేతిక సమస్యలు ఉన్నాయని నిరూపించడంతో చాలా వరకు గందరగోళం తొలగిపోయింది. అయినప్పటికీ..  స్థానిక అధికారుల వైఖరి వల్ల రైతులు   భయాందోళనలకు లోనవుతున్నారు. ఉండవల్లి ప్రాంతం విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడి భూమి ఖరీదైనది కాబట్టి, ఇక్కడి రైతులకు సాధారణ ప్యాకేజీ కాకుండా ఒక ప్రత్యేక కన్సిడరేషన్ తో మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం ఎంతో అవసరం.

గతంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఉండవల్లి పొలాల్లో పర్యటించి, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు లాక్కోవద్దని, రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నేరుగా చొరవ తీసుకుని, రైతులతో ముఖాముఖి మాట్లాడి భరోసా కల్పిస్తే ఈ సమస్య చాలా సులభంగా పరిష్కారమవుతుంది. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కోసం కొంత త్యాగం అనివార్యమైనప్పటికీ, ఆఖరి రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

ఇలా ఉండగా ప్రముఖ విశ్లేషకుడు కిలారు నాగేశ్వరరావు ఉండవల్లి భూ సమీకరణ విషయంలో ఈ పరిస్థితి నెలకొనడానికి అమరావతిలో అధికారుల మొద్దు నిద్రేకారణమని అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య పరిష్కారం కావాలంటే స్వయంగా చంద్రబాబు అక్కడి రైతులతో ముఖాముఖీ మాట్లాడి స్పష్టమైన భరోసా ఇవ్వాలన్నారు.