చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న బీజేపీ

 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిన బీజేపీ, రెండు తెలుగు రాష్ట్రాలలో వీలయినంత మందిని చేర్చుకునే పనిలో పడింది. ఆ చేర్చుకునేది ఏదో పేరున్న నాయకులనో, నలుగురు చేయెత్తి నమస్కారం పెట్టగలిగిన వ్యక్తులనో చేర్చుకుంటే ఫర్వాలేదు కానీ ఒక అరవై ఏళ్ళు పైబడిన మహిళను తనను లైంగికంగా వేధించిందని పరువు తీసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు పరువు తీసుకుని, దానిని కవర్ చేసుకునే పనిలో పడింది. తాజాగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ – ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తనను లైంగిక వేధింపులకు గురి చేసిందంటూ ఎన్నికలా సమయంలో  ఫిర్యాదు చేసిన కోటి అనే వ్యక్తిని కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. 

అయితే కోటి కావాలనే లక్ష్మీ పార్వతి పరువు తీయడానికే ఇలా చేశాడని హైదరాబాద్ పోలీసులు తేల్చారు, అంతేకాదు పూనమ్ కౌర్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోలని వైరల్ చేసింది కూడా ఇతనే అని పోలీసులు గుర్తించారు. కోర్టుకు వెళ్లి నం బెయిలబుల్ వారెంట్ తెద్దాం అనుకునే లోపే ఈ కోటి వెళ్లి బెయిలు తెచ్చేసుకున్నాడు. అయితే అప్పుడు మిస్సయ్యిన కోటి నిన్న బీజేపీ అధ్యక్ష్యుల వారి కండువాలో కనపడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంపై సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీపార్వతి వైసీపిలో ఉంది కాబట్టి ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరి ఉంటాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళను ఆర్ధిక ఉగ్రవాదులు అంటూ తెలుగు ప్రజల్లో ప్రాజెక్ట్ చేసిన బీజేపీ పెద్దలు ఆ తర్వాత ఏమాత్రం తొణకకుండా వారిని పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అని జనం సరిపెట్టుకుని ఉండచ్చు, కానీ ఒక మహిళ అది కూడా వృద్ద మహిళను ఇలా అసభ్య రీతిలో చిత్రీకరించిన ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కోటి పార్టీలో చేరడం వలన ఒరిగేది ఏమీ లేకున్నా పెద్ద నష్టం కలిగేలా ఉండడంతో బీజేపీ నేతలు వెంటనే దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. 

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గానికి చెందిన 80 మంది టీడీపీ కార్యకర్తలు నిన్న పార్టీలో చేరారని వారిలో కోటి కూడా ఉన్నాడని అతనిని ప్రత్యేకంగా ఏమీ చేర్చుకోలేదని, ఇంకా బీజేపీలో కోటికి సభ్యత్వం ఇవ్వలేదని. అతడు బీజేపీ సభ్యుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయినా తాను 100 మందితో వచ్చి జాయిన్ అయ్యానని, మోడీ పాలన నచ్చే జాయిన్ అయ్యానని కోటి చెబుతుంటే బీజేపీ మాత్రం తమకు సంబంధం లేదని అంటోంది. అయినా విషయం తెలియక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది చెప్పండి.