కావలసింది ఉత్తుత్తి 'యాత్రలు' కాదు, తెలుగుజాతి రక్షణకు ఐక్యతా 'మాత్రలు'!

 

 

 డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]

 

 

"విశాలాంధ్ర ఏర్పాటు బలీయమైన రాష్ట్రావతరణకు మార్గం వేస్తుంది. ఈ బలమైన తెలుగురాష్ట్రం భారతదేశ ఐక్యతను పటిష్టం చేస్తుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేక సమస్యలకు దారితీస్తుంది, అధ్వాన్నపరిస్థితుల్ని సృష్టిస్తుంది, ఫలితంగా అప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం దొరల, పెట్టుబడిదారుల చేతుల్లోకి జారుకుని, దెబ్బతినిపోతుంది; ప్రజాతంత్ర శక్తులు బలహీనపడి నిర్వీర్యమైపోతాయి''

                             - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్మాత
                                స్వామి రామానందతీర్థ ప్రకటన
                                (1953 నవంబరు 3వ తేదీ)


ముందు చూపుగల ఆనాటి నాయకత్వం తెలుగువారందరి భావిభాగ్యోదయాన్ని కోరి, ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూడేళ్ళముందే చేసిన ఈ హెచ్చరిక నేటి రాష్ట్రంలోని మూడుప్రాంతాలలోని మూర్ఖపు నాయకులకు పట్టనందుననే తెలుగుజాతికి ఇన్ని అనర్థాలు దాపురించాయి. నాటి నాయకుల దూరదృష్టికి, నేటి అరకొర జ్ఞానులయిన నాయకులకు, ప్రతీ సమస్యను పదవీ ప్రయోజనాలతో 'తూకం' వేసుకుని చూచేనాటి రాజకీయ నిరుద్యోగుల సంకుచిత దృష్టికీ మధ్య ఉన్న అంతరాన్ని స్వామి రామానందతీర్థ ప్రకటన మరొక్కసారి బట్టబయలు చేస్తోంది. రామానందతీర్థ ప్రకటనలోని హెచ్చరికను పాటించకనే రకరకాల పేర్లతో నేడు రాష్ట్రంలోని రాజకీయపక్షాలు కొన్ని పూర్తిగా పక్కదారులు పట్టి తెలుగుజాతి పరువును బజారుపాలు చేసి ఇప్పుడు "పాదయాత్రల''నీ, "బస్సు యాత్రల''నీ తలపెట్టారు. రాజకీయ పక్షాల నాయకులకు రాష్ట్ర భవితవ్యంపైన, తెలుగుజాతి భాషా సంస్కృతులపైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క మాటమీద నిలబడి, జాతి విభజన ప్రతిపాదనను స్వార్థపరుల కృత్రిమ ఉద్యమాలను ఆదిలోనే ఎదిరించి, తిరస్కరించాల్సింది. కాని రాజకీయ స్వార్థప్రయోజనాల కొద్దీ వివిధస్థాయిల్లో మూడుప్రాంతాలలోని చెడిపోయిన నాయకులు ఆ పనిచేయలేక పోయారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆదినుంచీ అనేక తీర్మానాల ద్వారా అభిలషించి నిండుమనస్సుతో ఆశీర్వదించిన ఆనాటి జాతీయ కాంగ్రెస్ కుటుంబ స్వార్థప్రయోజనాల్లో నేడు ఈదులాడుతూ తెలుగుజాతిని అవమాన పరచడానికి సాహసించిన విషయం గమనించిన తరువాతనైనా తెలుగు ప్రధాన రాజకీయపక్షాలు ఎదురొడ్డి నిలవవలసింది! కాని అన్ని పక్షాలూ కుటుంబ స్వార్థప్రయోజనాల్లో ఈదులాడుతున్నవి. కాబట్టి జాతిని చీల్చడానికి తలా ఒక చెయ్యి వేశాయి!

 

రాష్ట్ర విభజన అవసరమా, అనవసరమా అన్నది కాంగ్రెస్ అధిష్ఠానపు "కుటుంబ రాజకీయం'' ప్రయోజనాల దృష్ట్యానే యు.పి.ఎ. అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియాగాంధి పరిశీలించింది; కొడుకు రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నికల తక్కెటలో తూచబోయింది. ఇందిరాగాంధీ నాయకత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చడాన్ని వ్యతిరేకిస్తూ రాగా, కోడలు సోనియా 'విభజన' చిట్కా ద్వారా తొమ్మిది కోట్లమంది తెలుగుప్రజల ఐక్యతను భగ్నపరచడానికి గజ్జెకడుతున్న విషయం తెలిసి కూడా కొన్ని పార్టీలు, కొందరు నాయకులూ పోటాపోటీలమీద 'విభజన' మంత్రాన్ని ముందు సూత్రప్రాయంగా ఆమోదించి, ఆ తర్వాత ఎవరికివారు ఎక్కడ 'వెనకబడి' పోతామోనని భావించి 'మూజువాణీ' నుంచి మూకకొలువుకు మారిపోయి ఉత్తరాలు కూడా యిచ్చి రావడం పెద్ద హైలైట్! ఇప్పుడు ఆ ఉత్తరాలను వెనక్కి తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతివ్వదు!



అధిష్ఠానం ఎంతటి 'చావుతెలివితో' వ్యవహరించిందంటే 'విభజన' ప్రతిపాదనపైన ఈ క్షణం దాకా పాలకపక్షంగా కాంగ్రెస్ అభిప్రాయమేమిటో స్పష్టం చేయకుండా "కాగల కార్యం గంధర్వులే తీరుస్తార''న్న దిలాసాతో ఇతరపార్టీల నాయకుల అభిప్రాయాల్ని అడిగి నమోదు చేసుకుందే గాని తన నిర్ణయమేమిటో బయటపెట్టలేదు. ఇతర పక్షాలను యిరికించిం తరువాత, "వాళ్ళంతా విభజనకు అనుకూలం కాబట్టి కాంగ్రెస్ అధిష్ఠానం చేయగలిగిందేమీ లేదు, రాష్ట్రాన్ని విభజించడం తప్ప'' అని ముక్తాయింపు విసిరింది! ఈ కృత్రిమ విభజన ప్రతిపాదకుడయిన అసలు రాజకీయ నిరుద్యోగి కె.సి.ఆర్. అయినందున, "ముట్టించి ముచ్చట'' చూడడమే అతగాడి పని అని అందరికీ తెలిసినా, అతడ్ని కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం [రాహుల్ ను ప్రధాని పదవికి తీసుకురావడం]వాడుకోదలచింది; ఈ కిటుకును కూడా ప్రతిపక్షాలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలోని ఒక శాఖ [సి.పి.ఐ.]సహా కనిపెట్టలేక పోయారు.


 

ఇక "తెలుగుదేశం'' అధినేత చంద్రబాబు కూడా రెండుకళ్ళ సిద్ధాంతం'' పేరిట రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టు నటించి నటించి తనపై ఉన్న కేసుల బెడదనుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ నాయకత్వాన్ని అంటకాగి, దౌర్భాగ్యపు లాలూచీ రాజీ ప్రతిపాదనగా కాంగ్రెస్ "విభజన'' సూత్రానికి "సై'' అని వచ్చాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయకూడని పని ఎందుకు చేశాడో తెలుగుప్రజలకు అర్థమైపోయింది. మొత్తం రాష్ట్రంలో "దేశం'' పార్టీ నిలువునా చీలిపోకుండా ఆయన ఎత్తిన ఎత్తుగడ - ప్రాంతానికో విధానాన్ని పార్టీ అనుసరించడం ద్వారా పార్టీని కాపాడుకోవటం! కాని ఈ "కిటుకు''ను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు రాజకీయం ద్వారా అటు కోస్తాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ ఆ పార్టీ వోటర్లలో భారీ స్థాయిలోనే పరువు కోల్పోతోంది. ఇది గమనించిన బాబు వర్గం జరిగిన తప్పు జరిగిపోయింది కాబట్టి, కాలిన చేతులు మానాలంటే మరో 'చిట్కా'కు తెర లేపాడు.


 

దాని పేరు "సమన్యాయం'', "విభజన వల్ల తలెత్తే సమస్యకు ముందు పరిష్కారం చూపాలి'' అలా చూపకపోతే తన "పోరాటాన్ని ఆపనని మరో యాత్ర సీమాంధ్రలో తలపెట్టాడు. కాని ఎంతసేపూ విభజనవల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కేంద్రానికి మొరపెట్టుకోవటమే తప్ప - కాంగ్రెస్ అధిష్ఠానానికి విభజనకు అంగీకారం తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని మాత్రం ఈరోజు దాకా బాబు ఉపసంహరించుకోలేదు; అంటే ఇతనికీ విభజనను బలపర్చడం ద్వారా అటు తెలంగాణలో పార్టీ ప్రతిష్ఠ పోకూడదు, ఇటు కోస్తాలో 'సమైక్యాంధ్ర' పేరిట కాకపోయినా రాజధాని నిర్మాణానికి అయిదు లక్షల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదన ద్వారా కోస్తాంధ్రులకు దగ్గర అయినట్టూ కన్పించాలి! ఈ శ్లేష్మంలో పడికొట్టుకుంటున్నాడు బాబు ప్రస్తుతానికి! వైరుధ్యంతో కూడిన ఇలాంటి ప్రకటనలు విడుదల చేస్తున్న చంద్రబాబు ఒకవైపు నుంచీ, చంద్రబాబు తన 'ప్రభావం' నుంచి జారిపోకుండా చూడ్డానికి కాంగ్రెస్ మరొక వైపునుంచీ పరస్పరం ప్రయోజనకర 'లాలూచీకుస్తీ'లలోకి దిగారు!


 

ఇందుకోసం ఈ రెండు పార్టీలలో ఒకటి తనకు ప్రత్యర్థులుగా భావించుకుంటున్న కెసిఆర్ పార్టీ టి.ఆర్.ఎస్.ను, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుండగా, మరో పక్షంవారు [కాంగ్రెస్ వారు] మరో 'లాలూచీకుస్తీ'లో తనకు దొంగ ప్రత్యర్థులుగా భావిస్తున్న టి.డి.పి.నీ, వై.ఎస్.ఆర్. పార్టీనీ 'టార్గెట్' చేస్తున్నారు. ఎటుతిరిగీ స్వార్థ రాజకీయాలు ఇరుపక్షాలవని ప్రజలకు వివరించి చెప్పకుండానే అర్థమయిపోయింది! ఇది యిలా వుండగా నిన్నటిదాకా "దేశం'' పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బాబు బావమరిది నందమూరి హరికృష్ణ తన బావగారి మీద "రాజకీయ బాంబు''ను పేల్చాడు! 2009 ఎన్నికల సందర్భంగా తన ప్రయోజనాల కోసం చంద్రబాబు స్థానిక టి.ఆర్.ఎస్. నాయకుడు కె.సి.ఆర్.తో పొత్తులు పెట్టుకోవద్దని, పొత్తుకలసినందువల్ల రెండు ప్రాంతాలలోనూ (తెలంగాణా, కోస్తాంధ్రలలో) తీవ్ర సమస్యలు ఉత్పన్నమావుతాయనీ తాను "దేశం'' నాయకత్వాన్ని ముందుగానే హెచ్చరించానని హరికృష్ణ [02-09-2013] వెల్లడించాడు!


 

ఈ పొత్తువల్ల తెలంగాణా, సీమాంధ్రలలో "దేశం'' పార్టీ అనేక సీట్లు కోల్పోతుందని తాను హెచ్చరించినా వినలేదని ఆయన పేర్కొన్నాడు! అందువల్ల బాబును ఇరుప్రాంతాల ప్రజలూ విశ్వసించాలంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి రాష్ట్ర విభజనకు అనుకూలతను వ్యక్తంచేస్తూ తాను రాసిన లేఖను ఉపసంహరించుకుని తెలుగుజాతి ఐక్యతను కాపాడడానికి సంసిద్ధతను ఈ ఆఖరి క్షణంలోనైనా బాహాటంగా వెల్లడించాలి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను తాను ఎంత విమర్శించినా కనీసం ఆ పార్టీ అంతవరకూ విభజించినా "ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయండి'' అంటూ చేస్తున్న ప్రకటనలను ఆపివేసి, రాష్ట్రాన్ని విభజించడానికి వీలులేదని స్పష్టాటిస్పష్టంగా ప్రకటించగల్గింది. కాని ఆ మాత్రపు సాహసం కూడా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాబు చేయలేకపోవటం దురదృష్టకరం!

 

"ఆత్మగౌరవ'' నినాదంతో ఎన్టీఆర్ ఆనాడు రాష్ట్రప్రజల మనస్సుల్ని చైతన్యవంతం చేయడంతో పాటు, అంతవరకూ తెలుగుజాతిని "మద్రాసీలు''గా మాత్రమే కేంద్రనాయకులతో సహా పిలుస్తున్న దశలో ఢిల్లీని గడగడలాడించి, జాతి గౌరవాన్ని పెంచాడు. కాని, ఈనాడు చంద్రబాబు కేసుల వలయంనుంచి బయటపడేందుకు స్వార్థప్రయోజనాల్ని ముందుకునెట్టి, తెలుగుజాతి గౌరవాన్ని ఫణంగా పెట్టి కూడా, తలపెట్టిన యాత్ర మాత్రం "ఆత్మగౌరవ''యాత్ర అనిపించుకోదు! ఆత్మగౌరవమే ఉంటే ఆదిలోనే అది ప్రస్ఫుటం కావాల్సింది!