50 లక్షల ఉద్యోగాలు పోయాయి

 

ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు పోయాయని పలు పరిశోధనల్లో, గణాంకాల్లో తేలింది. తాజాగా ఓ ప్రముఖ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2019 పేరుతో ఆజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది. '2016-18 మధ్య 50లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. 2016 నవంబరు ప్రారంభం నుంచే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే అదే సమయంలో ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ రెండూ యాదృచ్ఛికంగా జరిగాయి. ఇలా ఉద్యోగాలకు గండి పడటానికి నోట్లరద్దు నిర్ణయం ప్రత్యక్ష కారణం కాకపోయినా ఇందులో దీని పాత్ర కూడా ఉంది.' అని పేర్కొంది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గాయని నివేదిక తెలిపింది.