ఆప్ కథ అడ్డం తిరిగింది
Published on: Sat Mar 11, 2017 2:42PM
.jpg)
ఆమ్ ఆద్మీ అంచనాలు తలకిందులయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70కి 67 స్థానాలు సాధించి అధికారం చేపట్టిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అతిగా ఊహించుకుంది. దేశమంతా అబ్‌కీ బార్ ఆప్ సర్కార్ అంటారనుకుంది. కానీ, పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్‌కు అంత సీన్ లేదని తేలిపోయింది. ఈసారి పంజాబ్‌లో అధికారం చేపట్టడం ఖాయమని, గోవాలో కూడా ఖాతా తెరుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆప్‌కు రెండు రాష్ట్రాల్లోనూ నిరాశే ఎదురైంది. ఢిల్లీ తరహా ఫలితాలు వస్తాయనుకున్న ఆమ్ ఆద్మీకి పంజాబీలు షాకిచ్చారు. ఢిల్లీ పాలన చూసిన సర్దార్జీలు... ఆప్‌పై ఆశలు వదిలేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ చేతికి చిక్కడంతో ఆప్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. రెండో స్థానం కోసం బీజేపీ-అకాళీ దళ్ కూటమితో పోటీ పడాల్సి వచ్చింది. అటు, గోవాలో ఆప్ పరిస్థితి మరీ దయనీయం. ఫలితాలకు ముందు ఆప్ అతిగా ఊహించుకుంది. సరైన ఆధిక్యం రాకపోతే ఏ పార్టీతో కలిసేది లేదంటూ ధీమాగా చెప్పింది. తీరా చూస్తే... అసలు గోవాలో ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది.


