బీజేపీతో టీడీపీ దోస్తీ ఖాయమైంది..!
Published on: Sun Dec 15, 2013 8:51AM

తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతాపార్టీ ఎన్నికల పొత్తు ఖాయమైందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబుకు బిజెపి అగ్రనేతలు ఇచ్చిన ప్రాధాన్యం చూస్తుంటే ఈ వార్తలకు ఇంకా బలం చేకూరుస్తున్నాయి. బిజెపి ముఖ్యమంత్రి చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన బాబును బీజేపీ అగ్ర నేతలు బాగా ఆదరంగా స్వాగతించారు. ప్రమాణ స్వీకారం ఆద్యంతం బాబు మోడీ పక్కనే ఉన్నారు. ఇతర నేతలతోపాటు బాబు, మోడీలు చేతులు పైకెత్తి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. శివసేన, అలికాదళ్ లాంటి బిజెపి మిత్రపక్షాల నేతలు హాజరైన వారెవరికి లభించని ప్రాధాన్య౦ చంద్రబాబుకు బిజెపి నేతలిచ్చారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత చంద్రబాబు...వచ్చే ఎన్నికల్లో మనం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నామని తమ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో అవినీతిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కాంగ్రెస్ను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహలు వంటి వాటిపై మోడీతో చర్చించినట్లు బాబు పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పారట. త్వరలో సరైన వేదికపై తెదేపాతో పొత్తుపై బిజెపి పార్టీ అధికారిక ప్రకటన కూడా చేయనుందట. దీంతో బాబు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారంటూ మీడియా సంస్థలు కూడా వార్తలను జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి పోరాడుతున్న టిడిపి, నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న భారతీయ జనతాపార్టీ కలిసి ప్రయాణించడమే సరైన వైఖరని రాజకీయవిశ్లేషకులు కూడా భావిస్తున్నారు.


