వ్యూహాత్మకంగానే బిల్లు పై చర్చ

 

 

 

మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ మళ్లీ మొదలయింది. తీవ్ర గందరగోళం మధ్యనే శ్రీధర్ బాబు ముసాయిదా బిల్లు పైన చర్చను ప్రారంభించాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు అందుకు నిరాకరించినట్లుగా తెరాస ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే, చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధమవగా అసెంబ్లీ వాయిదా పడిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. చంద్రబాబు సభలో ఉన్నప్పటికీ లేరని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ముసాయిదా బిల్లు ప్రతులను చించి స్పీకర్ పోడియం వైపుకు విసిరేశారు. చించివేసిన విసిరేసిన ప్రతులు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కపై కూడా పడ్డాయి. సీమాంధ్ర శాసనసభ్యులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రతులు చించి వేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న భట్టి సభను మంగళవారానికి వాయిదా వేశారు.