టీఆర్‌ఎస్ కంచుకోటకు బీటలు..!

 

 

 

టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పిలువబడే సిద్ధిపేటకు బీటలు మొదలయ్యాయి. ఈ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వలసలు జోరందుకోవడంతో ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మండల కేంద్రమైన చిన్నకోడూరుకు చెందిన గ్రామపంచాయతీ ఉప సర్పంచు మంగా ప్రసాద్, మరో ఆరుగురు వార్డు సభ్యులు, కార్యకర్తలు సిద్ధిపేట ఆత్మ కమిటీ ఛైర్మన్ కాముని శ్రీనివాస్ పార్టీని వీడి ఎంపీ విజయశాంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

మరోవైపు సిద్ధిపేట నియోజ కవర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్ధిపేట మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ సర్పంచులు, గ్రామ, మండల శాఖ నాయకులు పెద్ద యెత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎవరికి వారుగా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.



ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన సిద్ధిపేట నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. అయితే, ఇప్పుడిప్పుడే సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజల్లో మార్పు కొ్టచ్చినట్లు అగుపిస్తున్నది. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం వల్ల అటు ప్రజలు, ఇటు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు కొంత అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.