మీ అబ్బాయి హీరోలా ఫీలవుతున్నాడా?!

 

 

     * పేరెంట్స్ మీటింగ్ ఉంటే కొడుకు స్కూల్ కి వెళ్లి రజిత. అక్కడ కొడుకు క్లాస్ టీచర్ చెప్పిన విషయాలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రజితకి. ఎల్.కె.జి. చదువుతోన్న ఆమె కొడుకు విశాల్ క్లాసులో తెగ అల్లరి చేస్తున్నాడట. పక్కవాళ్లతో మాట్లాడుతూనే ఉంటాడట. స్లీపింగ్ పీరియడ్లో అస్సలు నిద్రపోడట. పైగా నిద్రపోయే ఇతర పిల్లల్ని లేపేస్తుంటాడట. ఇవి చాలామంది పిల్లలు చేస్తారు కాబట్టి నవ్వుకుంది రజిత. మెల్లగా నచ్చజెప్తాను అంది టీచర్ తో. అయితే టీచర్ చెప్పిన ఒక విషయం మాత్రం రజిత మతి పోగొట్టింది. విశాల్ ఒక హీరోలా ఫీలవుతుంటాడట. 

 

       * అందరి మీదా పెత్తనం చేయడం, తను చేయాలనుకున్నదే చేయడం, తను చెప్పిందే అందర్నీ చేయమనడం, చివరికి టీచర్ చెప్పినా మొండిపట్టు పట్టడం చేస్తుంటాడట. అంతకన్నా విచిత్రం ఏమిటంటే... ఏదైనా స్కిట్ కానీ, డ్రామా కానీ వేయాల్సి వస్తే, పవర్ ఫుల్ పాత్ర అయితేనే చేయడానికి ఇష్టపడతాడట. పులి, సింహం లాంటి వేషాలట. ఏ కోతి వేషమో, కుక్క వేషమో వేయమంటే వేయనంటాడట. రాజులా తప్ప సైనికుడిలా చేయనంటాడట. ఇదంత మంచి లక్షణం కాదు అంది టీచర్.


   * బుర్ర తిరిగిపోయింది రజితకి. ఎందుకంటే పిల్లాడి వయసు ఎంతో లేదు. ఇంకా ప్రపంచం కూడా సరిగ్గా తెలియదు. మరి అప్పుడే ఇలాంటి ఆధిక్య ధోరణి ఎలా వచ్చిందో అర్థం కాలేదామెకి. ఆమెకే కాదు... చాలామందికి అర్థం కాదు. అలా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది పిల్లలు పెద్దయ్యాక పెత్తందారుల్లాగా వేధింపులకు సైతం దిగేవారులాగా తయారవుతారన్నది కాదనలేని నిజం. కాబట్టి ఆ తప్పు మీరు చేయకండి. మీ కొడుకు మీద ఓ కన్నేసి ఉంచండి.

 

   * ఒకప్పుడు పిల్లలు తండ్రిని ఫాలో అయ్యేవారు. నాన్న ఏం చేస్తే అది చేయడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు టీవీల ప్రభావం ఎక్కువైంది. ఏ సినిమానో చూసినప్పుడు ఆ హీరో చెప్పింది అందరూ వినడం చూస్తారు. తన మాట కూడా అలా వినాలన్న భావన అప్పుడే మొదలవుతుంది. ఏ కార్టూన్ షోలోనో ఒక పిల్లాడు అందరినీ అదరగొట్టి బెదరగొట్టేస్తుంటాడు. దాంతో అలా చేస్తే తానూ హీరోనవుతాను అనుకుంటాడు. ఇలాంటివే పిల్లల మనసులో హీరోయిజాన్ని నిద్ర లేపుతుంటాయి. 

 

   * అంతేకాక ఇంట్లో వాతావరణం కూడా ఒక కారణం. కొందరి ఇళ్లలో మనం ఎక్కువ వాళ్లు తక్కువ అన్న భేషజాలు ఎక్కువగా ఉంటాయి. పనివాళ్లను, కూరగాయలవీ అమ్ముకునేవాళ్లను, వాచ్ మేన్ లాంటి వాళ్లను బలహీనులుగా చూస్తుంటారు. అది పిల్లలు కనుక గమనిస్తే వాళ్లలో తాము ఎక్కువ అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది. ఇతరుల్ని తక్కువగా చూడటం అలవాటవుతుంది. తద్వారా తానెప్పుడూ పై స్థాయిలోనే ఉండాలన్న పట్టుదల కూడా వస్తుంది. ఇక ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గడానికి ఇష్టపడరు. అది మాత్రమే కాదు.. టీవీలో చూసినట్టు రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. 

 

   * ఇదంతా పదేళ్లో పదిహేనేళ్లో వచ్చాక మొదలవుతుందనుకుంటే పొరపాటు. ఊహ తెలిసినప్పటి నుంచి, మాట వచ్చినప్పట్నుంచి పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఆదిలోనే వాళ్లకి సరైన దారి చూపించాలి. హీరోలా ఉండటం మంచిదే కానీ హీరోయిజం పాజిటివ్ గా మాత్రమే ఉండాలన్న నిజాన్ని మెల్లమెల్లగా వాళ్లకి నేర్పండి. మొక్కై వంగనిది మానై వంగదని మర్చిపోకండి. 


-Sameera