వెకిలి సంభాషణల మీద ఓ హీరో యుద్ధం

 

 

ఎవరెన్ని మాటలు చెప్పినా... ఆడవారంటే ప్రపంచానికి చులకనే! మగవాడి సుఖానికి ఉపయోగపడే బొమ్మలాగా, 24/7 పని చేసిపట్టే యంత్రంలాగా ఇప్పటికీ ఆడవారి పట్ల అదే దృక్పథం. పరిస్థితులు కాస్త మారి ఉండవచ్చు. కానీ మగవాడిలో కామం చెలరేగినా, అహం దెబ్బతిన్నా... ఇప్పటికీ అదే పర్యవసానం. ఈమధ్యే కేరళలో ప్రముఖనటి భావన పట్ల జరిగిన లైంగిక వేధింపులే ఇందుకు సాక్ష్యం.
భావన పట్ల జరిగిన అత్యాచారం కేరళ సినీరంగంలోని చీకటి కోణాలకు బెయటకు తీసుకువచ్చింది. దేశంలోనే ఉత్తమ చిత్రాలని నిర్మించే పరిశ్రమలో అసలు విలువలే లేవన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేరళ సినీరంగమంతా ఓ మాఫియాగా, రకరకాల గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యపోరుని సాగిస్తోందని చాటింది. కానీ ఈ ఉదంతంలో భావన చూపిన ధైర్యం అసమానం. తనకి జరిగిన అవమానాన్ని దిగమింగి దానిని పోలీసులకి తెలియచేయడం దగ్గర నుంచీ వారు చట్టానికి చిక్కేదాకా ఊరుకునేది లేదంటూ ఆమె చేసిన ప్రతిన వరకూ భావన ప్రతి అడుగులోనూ తెగువ చూపింది.

సహజంగానే ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ప్రముఖ నటికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలైంది. కేరళ సినీరంగమంతా భావనకు అండగా నిలిచింది. ప్రముఖ నటులంతా భావనకు అండగా ర్యాలీలు నిర్వహించారు. కానీ ప్రముఖ మలయాళ నటుడు పృధ్వీరాజ్ మాత్రం ఎవరూ సాహసించని కొన్ని భావాలను వ్యక్తపరిచాడు. ఫేస్బుక్ వేదికగా పృధ్వీరాజ్ చెప్పిన ఆ మాటలు ఇప్పుడో సంచలనం!

తన జీవితంలో అద్భుతం అనదగిన క్షణాలన్నీ కూడా స్త్రీలతోనే ముడిపడి ఉన్నాయంటూ తన లేఖని మొదలుపెట్టాడు పృధ్వి. తారుమారైన జీవితాన్ని తట్టుకొని తనని పెంచిన తల్లి దగ్గర నుంచీ, తన బిడ్డను కనేందుకు 40 గంటలు ప్రసవవేదన పడ్డ భార్య వరకూ స్త్రీల ఔన్నత్యం ముందు తను తలవంచక తప్పలేదంటూ ఒప్పుకున్నాడు. తన సహనటి భావన చూపించిన తెగువతో మరో అసాధారణమైన స్త్రీని చూసే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడే పృధ్వి లేఖ ఊహించని వాక్యాలను వెల్లడించింది.

సినిమాలలో స్త్రీలను చులకను చేస్తూ తాను గతంలో పలికిన సంభాషణలకు క్షమాపణలు చెబుతున్నానంటూ పాఠకులను ఆశ్చర్యపరిచాడు పృధ్వి. ఇకపైన అలాంటి మాటలను పొరపాటున కూడా పలకనని చెప్పుకొచ్చాడు. ఒక నటుడిగా ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు తాను సిద్ధమేననీ... అయితే అందులో భాగంగా స్త్రీలను కించపరిచే సన్నివేశాలను గొప్పగా చూపించే ప్రయత్నం మాత్రం ఎన్నటికీ చేయనని హామీ ఇచ్చాడు.

భావన చూపించిన తెగువతో తాను ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసిస్తూ పృధ్వి ఉత్తరం ముగిసింది. కానీ పృధ్వి చూపిన తెగువ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సినిమాల్లో హీరోయిన్లతో పరమరోతగా ప్రవర్తిస్తూ, అదంతా వృత్తిలో భాగమని వెనకేసుకుని వచ్చేవారికి ఆయన ఉత్తరం చెంపపెట్టులా మారింది. నిజానికి సినిమా అంటేనే ఓ పురుషాధిక్య ప్రపంచం. సహజంగానే అందులో ఆడవారిని కేవలం ఓ వినోద వస్తువుగానే చూపిస్తారు. కానీ స్త్రీ స్వేచ్ఛ పెరుగుతోందని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో ఆడవారిని మరింత గౌరవంగా చూపాల్సింది పోయి, వారిని మరింత చులకన చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ‘కమీషనర్ కూతుళ్లకి పెళ్లిళ్లు కావా! వాళ్లకి మొగుళ్లు రారా...’ అని ఓ హీరో వాక్రుచ్చుతాడు. ‘అమ్మాయి అన్నాక మగాడికి పడితీరాలి...’ అంటూ మరో హీరో పేట్రేగుతాడు. తన కన్నుపడిన అమ్మాయితో కాపురం చేసేందుకు పట్టుమంచాన్ని సిద్ధం చేసుకున్నానని వదరుతాడు మరో హీరో! ఒక్క మాటలో చెప్పాలంటే మన హీరోల మాటలు పక్కన రోడ్డు పక్కన కనిపించే పోరంబోకుల మాటలను తలపిస్తాయి.
అమ్మాయిల వెంటపడి వేధించడం తప్పుకాదనీ, వాళ్లు మొదట్లో నిరాకరించినా ప్రేమలో పడి తీరతారనీ, అలా వారు ప్రేమలో పడేందుకు ఎంతకైనా తెగించవచ్చనీ హామీ ఇస్తున్నాయి మన సినిమాలు. సహజంగానే ఇలాంటి సన్నివేశాలు కుర్రకారు మీద గాఢమైన ప్రభావం చూపిస్తుంటాయి. అలా ప్రభావం చూపుతాయి కాబట్టే దర్శకులు పదేపదే ఇలాంటి సినిమాల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ ఏదన్నా సంఘటన జరిగితే మాత్రం... అందులో సినిమాల దుష్ఫ్రభావం ఏమాత్రమూ లేదని ముసుగులు కప్పేసుకుంటారు. ఆ మసుగుని తొలగించాడు ఒక హీరో! స్త్రీలను కించపరిచే సన్నివేశాలు సిగ్గుచేటంటూ తొలి గొంతుకని వినిపించాడు.

పృధ్వి రాసిన ఈ లేఖ ఇప్పుడు ఫేస్బుక్లో ఓ సంచలనం. 60 వేలకు పైగా లైక్స్, 14 వేల షేర్లు, 3 వేల కామెంట్లతో సమాజంలోకి చొచ్చుకుపోతోంది. అరణ్య కృష్ణన్, శరణ్య మోహన్ వంటి మలయాళ చిత్ర ప్రముఖులంతా ఈ పోస్టుకి ప్రతిస్పందిస్తున్నారు. మరి వెకిలితనానికి మారుపేరు అనదగిన పాత్రలతో తెలుగు చిత్రాలను నింపేసిన క్రియేటివ్ దర్శకులు, ఎనర్జెటిక్ నటులు ఈ పంథాను అనుసరించేందుకు ముందుకు వస్తారా లేకపోతే నిప్పుకోడిలాగా కళామతల్లి ఒడిలో దాక్కొనే ఉంటారా అనేది చూఆల్సిందే!
 

- నిర్జర.

 

 

COURAGE (పృధ్వి లేఖ)

Some of the most poignant moments in my life have been punctuated with moments of incredible courage. Courage from what I have now fully realised are God's most benevolent yet intricate creations. WOMEN!

From a mother picking up pieces of a suddenly derailed life, to bring up two young boys to be the men they are today..to a wife who at the fag end of a 40 hour labour, just as she was being cut open without an anaesthetic, holding my hand and telling me "It's alright Prithvi"..I have repeatedly been dumbfounded in realising how much of a lesser being I am in the company of the women in my life.

And today..as my dear friend walks in to the sets to kick start the shooting of her new film "ADAM", I once again bear witness to an extraordinary moment of courage from an extraordinary woman in my life! Today..she makes a statement..a statement that will echo through time, space and gender..that no one or no incident has control over your life but YOU! A statement that will now be part of counselling sessions and pep talks around the world. A statement that you my friend..are making in a million unheard voices!

And to those voices I apologise..for at an age and time when I wasn't wise enough..I have been part of films that celebrated misogyny..I have mouthed lines that vilified regard for your self respect and I have taken a bow to the claps that ensued. NEVER AGAIN..never again will I let disrespect for women be celebrated in my movies! Yes..I'm an actor and this is my craft! I will whole heartedly trudge the grey and black with characters that possess unhinged moral compasses...but I will never let these men be glorified or their actions justified on screen.

Once again..ladies and gentlemen..stand up and applaud for her! Behind the gutsy spunk, there is a vulnerable celebrity who knew well enough what this decision of hers would mean to a life under constant scrutiny. But she also knew..that she had to see it through...for that would set an example..light a torch that will show a path for many to follow!Today she makes a statement..

A statement of extraordinary courage!
Fanboy for life...dear friend..fanboy for life!
Love always,
Prithvi.