"అతని చేతులు అతనికి సహకరించవు అంటే అర్ధమయిందా? అతని చేతివ్రేళ్ళు ఏదైనా వ్రాసేందుకు మొరాయిస్తాయి-చావుకన్నా ఘోరం కదూ....?" మాస్టర్ నవ్వుతూ ఒక్కక్షణం ఆగాడు. "ఇవి చైనీస్ పాయిజన్స్ మానవ శరీరంలోని ఏ భాగాన్నయినా పనిచేయకుండా ఆపగలవు. అదన్న మాట మాస్టర్ ట్రీట్ మెంట్" అంటూ మెసెంజర్ కేసి చూస్తూ వేల్లమన్నట్లు సైగ చేశాడు.

    ఆగంతకుడు తడారిన గొంతుకతో లేస్తూ మనసులోనే అనుకున్నాడు ఇది తనకో హెచ్చరిక అని.
    
                                                      *    *    *    *    *
    
    త్యాగరాజన్ ఇంటి నేలమాళిగలో లైట్సు విశ్రాంతిని మర్చిపోయాయి.
    
    ఇంటి ప్రధానద్వారానికి తాళం వేసి, ఇంటివెనుకగా లోపలకు వెళ్ళి అవసరమయిన సరంజామాని నేలమాళిగలో ఉన్న లేత్ మిషన్ ముందుకి చేర్చుకుని జోహ్రా ఆర్దరిచ్చిన రైఫిల్ ని తయారుచేయడంలో పూర్తిగా నిమగ్నమయిపోయాడు.
    
    ఒక్కోరోజు గడిచిపోతుంటే రైఫిల్ లోని ఒక్కో పార్ట్ క్రమంగా తయారవసాగింది.
    
    త్యాగరాజన్ నిద్రాహారాలు మానేసి అదేపనిలో ఉండిపోయాడు.
    
    నాకింకా ఎంతరావాలి.....? అని తను అడగాలి- 99,997-33 రావాలని జోహ్రా పంపించే వ్యక్తి అనాలి. అప్పుడు తను తయారుచేసిన ఫైర్ ఆర్మ్ ని అతనికి హేండోవర్ చేయాలి డబ్బు తీసుకోవాలి.
    
    ఆ స్థలం నుంచి తన మకాం మార్చాలి.
    
    లేత్ మెషిన్ మీద రైఫిల్ బ్యారెల్ ని సానపడుతూ అనుకున్నాడు త్యాగరాజన్.
    
                                                     *    *    *    *    *
    
    బొంబాయిలో ఒక మారుమూల ఉన్న చిన్న స్టూడియోకి వెళ్ళి తను ఎక్స్ పోజ్ చేసిన రీల్ ఇచ్చి డెవలప్ చేయించుకుని, దగ్గరుండి ప్రింట్స్ వేయించుకొని అతనాశించిన దానికన్నా టెన్ టైమ్స్ ఎమౌంట్ పే చేసి బయటపడ్డాడు జోహ్రా.
    
    ఆ ఫోటోస్ లో మాస్టర్ బంగ్లా, ప్రహరీగోడ, సెక్యూరిటీ, సెర్చ్ లైట్స్ క్లియర్ గా వచ్చాయి.
    
                                                      *    *    *    *    *
    
    లిండాహాన్ సింగపూర్ పోలీస్ కమీషనర్ ని కలుసుకొని మాస్టర్ మీద హత్యా ప్రయత్నం జరగబోతుందంటూ దాన్ని నివారించటానికి తగిన చర్యలు తీసుకోమంటూ ఒక అభ్యర్ధనను అందించాడు. ఆపైన ఎకనాలెడ్జిమెంటు కూడా తీసుకున్నాడు.
    
    వెంటనే అక్కడి నుంచి ఫ్లైట్ లో హాంగ్ కాంగ్ బయలుదేరి వెళ్ళాడు.
    
                                                      *    *    *    *    *
    
    "మనం ఎప్పుడు కలవబోతున్నాం...?" మృదుల గోముగా అడిగింది. తను మృదులను కలవలేక పోవటం అన్నది మిల్లర్ మూలంగానే అని భావించిన మాస్టర్ ఇరిటేట్ అయ్యాడు. సెక్యూరిటీ పేరిట తనకు వ్యక్తిగతంగా లభించే ఆహ్లాదం దూరం కావటం మాస్టర్ ని అమితమైన ఆగ్రహాన్ని తెప్పించింది. దాన్ని తనలోనే దాచుకుంటూ "రేపే కలవబోతున్నాం" అన్నాడు మెల్లగా.
    
    "రేపా...?!!" మృదుల ఎగ్జయిట్ మెంటుకి గురవుతూ ప్రశ్నించింది.
    
    "అవును.... రేపే..."
    
    "ఎక్కడ...?"
    
    "ఒక షిప్ లో"
    
    "అవును లంగరు వేసి వున్న నా షిప్ లో కలవబోతున్నాం."
    
    "నేను ఎక్కడుండాలి? మీరు నన్నెక్కడ కలుస్తారు?
    
    ఎలా పికప్ చేసుకువెళతారు? ఉద్వేగాన్ని అణుచుకోలేక ప్రశ్నించింది మృదుల.
    
    "అంత తొందరయితే ఎలా?"
    
    "మీకు మాత్రం లేదేమిటి తొందర?" గండు కోకిల మత్తు ఆమె కంఠంలో ప్రస్ఫుటమయింది.
    
    నరాలు జివ్వున లాగినట్లనిపించింది మాస్టర్ కి.
    
    "ఉంది అందుకే ఎంతో రిస్క్ తీసుకుని నా నిర్ణయాన్ని తెలియచేశాను...ఎక్కడ? ఎప్పుడు? ఎలా అన్నది తిరిగి నేనే తెలియచేస్తాను... బై..." అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ ని ఆఫ్ చేశాడు.
    
    ఆ వెంటనే లేచి వడివడిగా ప్రక్కరూంలోకి వెళ్ళి, తన ఫోన్స్ కి మిల్లర్ కంట్రోల్ రూంకి వున్న టెలిఫోన్ బగ్ ని తిరిగి కనెక్టు చేశాడు.
    
    ఎలాగయినా మృదులను కలుసుకోవాలి అదీ మిల్లర్ కి తెలీకుండా.
    
    ఎలాంటి రిస్క్ లేకుండా.
    
    ఎలా...? మాస్టర్ అనీజీగా అటూ ఇటూ తిరుగుతూ తీవ్రంగా ఆలోచించసాగాడు.
    
                                                    *    *    *    *    *
    
    మిల్లర్ మాస్టర్ ప్రోగ్రాం షీట్ ని క్షుణ్ణంగా శోధిస్తున్నాడు.
    
    జూన్ నెల ప్రోగ్రామ్స్ అని వ్రాసి వున్న ఆ షీట్ మీద వరుసగా మాస్టర్ అటెండ్ కావాల్సిన ప్రోగ్రామ్స్ వ్రాసి వున్నాయి.
    
    జూన్ 2 : ఎస్సెల్ వరల్డ్ విత్ మదర్ అండ్ సోహ్ని.
    జూన్ 5 : మీటింగ్ విత్ హాంకాంగ్ షాంఘై బ్యాంక్ చైర్మన్ (బొంబాయి)
    జూన్ 9 : షిర్డి విత్ మధర్ అండ్ సోహ్ని.
    జూన్ 13 : యశోధర మందిర్ ఫౌండేషన్ స్టోన్ విల్ బి లెయిడ్ బై మాస్టర్.
    జూన్ 15 : పోర్చుగీస్ కళనీ మకావ్ కి స్వంత ఫ్లయిట్ లో ప్రయాణం.
    జూన్ 16 : మకావ్ టూ హాంకాంగ్
    జూన్ 17 : హాంకాంగ్ టూ సింగపూర్
    జూన్ 18 : సింగపూర్ టూ బొంబాయి
    జూన్ 20 : బొంబాయి నగర షరీఫ్ ఇస్తున్న డిన్నర్ కి అటెండ్ కావటం అన్నీ కన్ ఫర్మ్ అయిన ప్రోగ్రామ్స్.