భర్త పక్కకు తిరిగి పడుకుని, ఎంతసేపటికీ మాట్లాడకపోయేసరికి, కాంతమ్మకు ఉక్రోషం వచ్చి, చివాలున గదిలోంచి హాల్లోకి వెళ్ళి, అక్కడ యీజీఛైరొకటి లాక్కుని పడుకున్నది. ఇంతకాలం జరిగినా, దొంగతనం చేసి యింట్లోంచి పారిపోయిన తమ్ముడిమీద తన భర్తకు ప్రేమ తగ్గకపోవటం ఆమెకు వింతగా తోచింది. ఆనాడు చంద్రం విషయంలో కల్పించుకుని, భర్తచేత ఎన్నడూ లేంది చెంప ఛెళ్ళుమనిపించుకొన్న తరవాత కాంతమ్మ మరిది ప్రసక్తి భర్తదగ్గిర ఏనాడూ తేలేదు. భర్త అతణ్ణి గురించి ఏమైనా చెబితే వినేది, ఊకొట్టేది, అంతే.

 

    కాంతమ్మకు కొంచెం కునుకుపట్టే వేళకు ఎవరో తన భర్త గదిలోకి వచ్చిన అలికిడి వినబడింది. ఈ వేళప్పుడు ముందు పిలవాపెట్టకుండా అంత స్వతంత్రంగా గదిలోకి వచ్చే వాళ్ళెవరై వుంటారబ్బా? అనుకుంటూ కాంతమ్మ యీజీఛైరులోంచి లేచి తలుపుదగ్గిరకు వెళ్ళింది. గదిలో సంభాషణ సాగుతున్నది. ఆ వచ్చినవాడు ప్రసాదరావు!  

 

    ప్రసాదరావు వుత్తినేరాడు; ఆ సంగతి కాంతమ్మకు బాగా తెలుసు. వచ్చినప్పుడల్లా చంద్రాన్ని గురించి హోరెత్తిపోయేట్టు అదీ యిదీ మాట్లాడేస్తాడు. ఈ వేళకానివేళ వచ్చాడు గనుక యిందులో ఏదో విశేషమే వుంటుంది.  

 

    కాంతమ్మ గదిలోకి రెండడుగులు వేసి, గోడపక్కగా వున్న టేబిల్ మీద కాగితాలూ, అవీ సర్దుతున్నట్టు నటిస్తూ, భర్తముఖంకేసీ, ప్రసాదరావు ముఖంకేసి పరీక్షగా చూసింది. ప్రసాదరావు ముఖంలో ఏదో సంతోషం తాండవిస్తున్నది. భర్త ముఖంలో అంతకుముందున్న చిటపటలు పోయి, ఆ స్థానాన్ని మందహాసం ఆక్రమించుకుని వున్నది. అతడేదో పత్రికను శ్రద్ధగా పరికించి చూస్తున్నాడు. కాంతమ్మ టేబిల్ పక్కనే వున్న సోఫాలో కూర్చుని ఆముదం తాగబోయే ముఖంపెట్టి భర్తకేసి చూస్తూ వుండిపోయింది.    

 

    కృష్ణారావు హఠాత్తుగా పత్రికమీంచి తలఎత్తి, కాంతమ్మకేసి చిరునవ్వుతో చూస్తూ, "కాంతం! యిలా రా! చూడు! యీ ఫోటో మన చంద్రానిదే, సందేహంలేదు" అన్నాడు.    

 

    కాంతమ్మ ఏదో పుట్టిమునిగినట్లు హడావిడిగా సోఫాలోంచి లేచి భర్త దగ్గిరకుపోయి, అతడందించిన పేపరు తీసుకుని, ఫోటోకేసి చూసింది.   

 

    "ఏమండీ కాంతమ్మగారూ! చంద్రమేగదూ?" అని ప్రశ్నించాడు ప్రసాదరావు.

 

    "అవునండీ! అచ్చం చంద్రంలాగే వున్నాడు. కాని, పేరు చంద్రమోహన్ అని వుంది మరి!" అన్నది కాంతమ్మ - కంఠస్వరంలో ఆశ్చర్యం, దాన్నిమించిన అనుమానం స్ఫురింపజేస్తూ.

 

    "మన చంద్రమే! అనుమానపడేందు కాస్కారమే లేదు," అంటూ కృష్ణారావు ప్రసాదరావుకేసి తలతిప్పి, "ప్రసాదరావుగారూ, మీకు బాగా గుర్తేగా? చంద్రం పారిపోయిన కొత్తలో మనం గురుకుల్ వాళ్ళకు వుత్తరం రాశాం. వాళ్ళు చంద్రశేఖర్ అనే కుర్రవాడెవరూ తమ గురుకుల్ లో లేడనీ, కానీ చంద్రమోహన్ అనే కుర్రవాడొకడు కొత్తగా వచ్చి తమవద్ద చేరాడనీ బదులు రాశారు. చంద్రశేఖర్, చంద్రమోహన్ అని పేరు మార్చుకుని వుండొచ్చని మనకు కాస్త అనుమానం కలిగికూడా - ఆ విషయాన్ని అంతటితో ఎందుకు వదిలేశామో, యీనాటికీ నాకు అర్థం కావటంలేదు. శేఖర్ .... మోహన్, ఎంత చిన్నమార్పు! అయినా, మనం అమాయకుల్లా ఆ సంగతి నంతటితో వదిలేశాం. చంద్రం పేరెందుకు మార్చుకుంటాడులే అని సర్దిచెప్పుకున్నాం" అన్నాడు ఎంతో బాధపడుతూ.

 

    "అవును, పెద్ద పొరపాటే జరిగిపోయింది. మనం అమాయకుల్లా కాదు - సాంతం మతిపోయిన వాళ్ళలా ప్రవర్తించాం. గురుకుల్ వాళ్ళకు డబ్బుపంపి, ఆ చంద్రమోహన్ అనే కుర్రవాడి ఫోటో పంపమని రాసినా, అప్పట్లోనే నిజం బయటపడేది. అదంతా యిప్పుడనుకొని ఏం లాభంలెండి? పత్రిక పొద్దునే వచ్చినా, ఆ ఫోటో నేను గమనించనే లేదు. ఇంతకుముందే అమ్మాయి హేమచూసి ఆ సంగతి నాకు చెప్పింది. పాపం, దానికెంత సంతోషం కలిగిందనుకున్నారు? బాల్యస్నేహం కదా!" అన్నాడు ప్రసాదరావు.   

 

    కాంతమ్మ పత్రికను భర్తచేతికిస్తూ  "అమ్మయ్య, దేవుడి దయవల్ల చంద్రం క్షేమంగా వున్నట్టు తెలుసుకున్నాం ఇప్పుడెక్కడున్నదీ... ఆ అడ్రసు మీకు తెలుసుగదా? వెంటనే వెళ్ళి తీసుకురండి" అన్నది.

 

    కాంతమ్మ యింత హఠాత్తుగా, యింత మంచి మార్పు రావటం కృష్ణారావుకు చాలా ఆనందం కలిగించింది. ప్రసాదరావు కూడా సంతోషించాడు. "ఎంత కాదన్నా స్త్రీ హృదయం కదా మరి" అనుకున్నాడాయన.

 

    "కృష్ణారావుగారూ! ఇది మనందరికీ ఎంతో సంతోషసమయం" అంటూ ప్రారంభించాడు ప్రసాదరావు. "నేను ఒకరోజు మీతో అన్నాను గుర్తుందా - చంద్రం మంచి రచయిత అవుతాడని ఇప్పుడు చూడండి, చంద్రం రాసిన 'సాహిత్యమూ - సంస్కృతీ' అన్న పుస్తకానికి అకాడెమీ బహుమతి లభించింది. చంద్రాన్ని గురించిన పరిచయ వాక్యాలు చదివారు గదా! చంద్రం రాసిన నాలుగు నవలలు యింతకుముందే అచ్చయ్యాయట" అన్నాడు.  

 

    ప్రసాదరావు మాటలు వింటూంటే కృష్ణారావుకు సంతోషం, దుఃఖం కూడా ముంచుకు వస్తున్నది. "ఆలస్యం ఎందుకు? నేను రేపే బయలుదేరి వెళతాను" అన్నాడాయన.  

 

    "మీరెళ్ళేవరకూ ఢిల్లీలోనే వుంటాడని నమ్మకం ఏమిటి? అది అతను స్థిరంగా వుండే చోటు కాదుగదా! కనక, స్థిరంగావుండే అడ్రసేదో ముందు తెలుసుకు మరీ బయలుదేరండి" అని సలహా యిచ్చింది కాంతమ్మ.    

 

    "అదీ నిజమేనండీ, కృష్ణారావుగారూ! సెంట్రల్ సాహిత్య అకాడెమీకీ, యీ ఫోటో ప్రకటించిన హిందూస్తాన్ టైమ్స్ పత్రికకూ చంద్రం అడ్రసుకోసం రాస్తాను. అది తెలియగానే, మీరు బయలుదేరి వెళ్ళవచ్చు" అన్నాడు ప్రసాదరావు.

 

    కృష్ణారావుక్కూడా అలా చేయడమే బావుంటుందనిపించింది. ప్రసాదరావు కుర్చీలోంచి లేచి, వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరగానే కృష్ణారావు అతనివెంట గేటుదాకా పోయి సాగనంపి, "మీ రొచ్చేముందు నేను చంద్రాన్ని గురించే ఆలోచిస్తున్నాను. మీరు మంచి శుభవార్త తెచ్చారు. చాలా కృతజ్ఞుణ్ణి" అన్నాడు.   

 

    "చంద్రం మీకూ మాక్కూడా సమానంగా ప్రేమపాత్రుడు. ఇంత కాలానికి హేమ ముఖంలో ఆనందం, కొత్తకాంతీ చూశానంటే నమ్మండి" అన్నాడు ప్రసాదరావు.   

 

    ప్రసాదరావు గేటుదాటి వెళ్ళిపోగానే, కృష్ణారావు గబగబా ఇంట్లోకి వచ్చి, శరీరంలోకి నూతన శక్తి వచ్చినవాడిలా చప్పట్లు చరుస్తూ, "రజనీ! రజనీ! ఎక్కడ?" అంటూ కేకలు పెట్టాడు.

 

    రజని డిటెక్టివ్ నవల ఒకటి తెరిచి పట్టుకుని తన గదిలోనించి అయిష్టంగా బయటికివచ్చి. "ఏం, డాడీ! కథ మంచి క్లయిమాక్సులో వున్నప్పుడు పిలుస్తూంటారు. ఏమిటో తొందరగా చెప్పండి" అన్నది కొంచెం విసుగ్గా.     

 

    "మరేం లేదమ్మా! ఎవరేం చెప్పినా నమ్మి హడావిడి చేస్తుంటారు మీ నాన్న" అన్నది కాంతమ్మ దెప్పిపొడుస్తున్నట్టు.

 

    కాంతమ్మ మాటల్లో యింతలోనే అంత పెద్ద మార్పు వచ్చినందుకు ఆశ్చర్యపడుతూ, కృష్ణారావు పత్రికను కూతురు చేతికిచ్చి, "ఆ ఫోటో ఎవరిదో తెలుసా?" అని అడిగాడు.

 

    రజని - ఫోటోకేసి ఓమారు చూసి కిందవున్న పేరు చంద్రమోహన్ అని చదివి, "నాన్నా! ఆయన ఫోటో లోగడే ఎక్కడో చూశాను. ఆఁ. గుర్తుకొచ్చింది. ఈయన వ్రాసిన నవల ఒకటి... దాని పేరేమిటబ్బా... ఆఁ- 'తిరస్కృతి' రాజా యిస్తే చదివాను. చాలా బాగా రాశాడు. ఆ నవల అట్టమీదకూడా యిదే ఫోటో వుంది. అప్పుడు కూడా అనుకున్నాను, ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే అని" అన్నది రజని.   

 

    "ఆ నవల నా కివ్వనేలేదే! ఎన్నాళ్ళ కిందట చదివావు?" అని ప్రశ్నించాడు కృష్ణారావు.

 

    "ఓ ఆర్నెల్లయిపోయింది. నీ కెందుకివ్వాలి! నువ్వసలు నవలలు చదవనే వద్దంటావుగా" అన్నది రజని చిరుకోపంగా.

 

    "చూడమ్మా, నీ పెట్టెలోవున్న బాబాయి ఫోటో ఒకసారి తెస్తావా?"

 

    "ఎందుకూ? యిప్పుడే తెస్తాను" అంటూ రజని ఒక్క పరుగున పోయి, పెట్టెలోంచి ఫోటో తీసుకువచ్చి తండ్రి కిచ్చింది.

 

    అంతదూరంలో నిలబడి తండ్రీ - కూతుళ్ళ హడావిడంతా గమనిస్తున్న కాంతమ్మ, "కాస్తకే అంత మురిసిపోతే ఎలా? మనిషిని పోలిన మనుష్యులు ఎందరో వుంటారు" అన్నది మూతి తిప్పుతూ, రజని కీమాటలేమీ అర్థంకాలేదు.

 

    "చూడమ్మా! ఈ రెండు ఫోటోలకూ పోలికలున్నవేమో?" అంటూ కృష్ణారావు, పత్రికనూ, ఫోటోనూ కూతురుకిచ్చాడు. అతడు భార్య అన్నమాటలు వినిపించుకున్నట్టే లేదు.

 

    రజని రెండు ఫొటోలనూ ఒకదాని పక్కన ఒకటిపెట్టి ఓ క్షణం కాలం పోల్చి చూసి, "అవును డాడీ! ఈ ఫోటోలో ఉన్నది బాబాయే! సందేహంలేదు. ఇంటి కెప్పుడొస్తాడో" అంటూ పెల్లుబికిన ఆనందంతో రెండు చేతులతోనూ తండ్రిని చుట్టివేసింది.   

 

    "దొంగతనం చేసి ఇంటిలోంచి పారిపోయిన తుంటరి కుర్రాడు అంత గొప్పవాడవుతాడంటే, నాకు నమ్మకం కలగటం లేదు. తండ్రీ కూతుళ్ళు మరీ అంత తన్మయత్వం పడకండి?" అన్నది కాంతమ్మ విసురుగా.