పాలిచ్చే తల్లికి పాఠాలు!

 

 

బిడ్డకి తల్లిపాలు అమృతంతో సమానం. కానీ కొన్నిసార్లు తనకు తెలియకుండా తల్లి ఆ అమృతాన్ని కలుషితం చేస్తుంటుంది. దానివల్ల బిడ్డకు బోలెడన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి పాలిచ్చే ప్రతి తల్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనులు మానుకోవాలి. అవేంటంటే...

* టీ, కాఫీలు ఎక్కువ తాగకూడదు. అవును నిజం. తల్లి తీసుకునే ఆహారంపై బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి టీ, కాఫీలు ఎక్కువ తాగి బిడ్డకు పాలివ్వకూడదు అంటున్నాయి కొన్ని పరిశోధనలు. కెఫీన్ మోతాదు ఎక్కువై పాల ద్వారా బిడ్డలోకి చేరితే బిడ్డకు కడుపు నొప్పి వస్తుంది అని కూడా అంటున్నారు.

* పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్లకూడదు. ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్ వేసేసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందేమో కానీ మీ పాలు తాగే బిడ్డకు విషయమవుతుంది. కాబట్టి డాక్టర్ అనుమతి లేకుండా పొరపాటున కూడా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.

* ధూమ, మద్యపానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మారిన జీవనశైలి మహిళలకూ కొన్ని అలవాట్లు చేసింది. మామూలప్పుడు అవి తనకి మాత్రమే చేటు చేస్తాయి. కానీ పాలిచ్చే సమయంలో బిడ్డకు అంతకు రెట్టింపు చేటు చేస్తాయి. కొన్నిసార్లు వాళ్ల ప్రాణానికి ప్రమాదం కూడా ఏర్పడవచ్చు.

* అలర్జీలు కలిగించే ఆహారం తీసుకోకూడదు. అంటే తల్లికి కాదు. మనకు అలర్జీ వస్తుందనుకుంటే మనం ఎలాగూ తినం. కానీ ఏదైనా తినేటప్పుడు బిడ్డకు దానివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని ఆలోచించి తినాలి. తెలుసుకోడానికి ఇంటర్నెట్లు ఉన్నాయి. లేదంటే డాక్టర్ ని అడిగినా చెప్తారు. 

* లోపలకు వెళ్లే ఆహారమే కాదు... బిడ్డ నోటికి తగిలే చర్మం కూడా శుభ్రంగా ఉండాలి. అందుకే శుభ్రంగా కడుక్కుని, తుడుచుకుని ఆ తర్వాతే పాలివ్వాలి. 

* దుస్తులు, లో దుస్తులు, ముఖ్యంగా బ్రాసరీలు చాలా శుభ్రంగా ఉండాలి. డెటాల్ వేసి బాగా ఉతుక్కుని ధరించాలి. తల్లి కచ్చితంగా రెండు పూటలా స్నానం చేయాలి. 

* బాడీ లోషన్లు, మాయిశ్చరయిజర్లు, బాడీ స్ప్రేల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరమంతా పూసుకున్నా స్తనాలను మాత్రం వదిలేయాలి. లేదంటే వాటిలోని కెమికల్స్ పిల్లల నోటిలోకి వెళ్లిపోతాయి. 

          ఎన్నో కలలు కంటే ఒడిలోకి వచ్చిన బిడ్డ కోసం ఈ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా? ఒక్కసారి తల్లయ్యాక మీరు మీకు నచ్చినట్టు కాదు... మీ బిడ్డకు నచ్చినట్టు నడచుకోవాలి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన పిల్లలకు పెద్ద పెద్ద కష్టాలను తెచ్చిపెడతాయి మరి! 

-sameeranj