బడి మీద భయం... మీరే చేయాలి దూరం!

 

స్కూళ్లు తెరుచుకున్నాయి. చిన్నారుల ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. పొద్దున్నే లేచి, స్నానాలు చేసి, పుస్తకాల సంచీలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు పిల్లలు. అయితే ఆల్రెడీ స్కూల్ అలవాటైపోయిన వాళ్లకి ఫర్వాలేదు. కానీ మొదటిసారి బడికి వెళ్తున్న పిల్లలతో మాత్రం పెద్ద తంటానే. నాలుగేళ్లు ఆడుతూ పాడుతూ గడిపేసిన వాళ్లకి... ఇప్పుడు సడెన్ గా ఓ కొత్త ప్రదేశానికి వెళ్లి, కొత్త మనుషుల మధ్య రోజంతా గడపడం అస్సలు నచ్చదు. దాంతో బెదిరిపోతారు. బడికి వెళ్లనంటూ మారాం చేస్తారు. కొంత మంది పిల్లలైతే నెలలు గడుస్తున్నా ఏడుస్తూనే ఉంటారు. అలా కాకుండా వాళ్లు ఆనందంగా బడికి వెళ్లేలా చేయాలి. అది కచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది.

- రోజూ స్కూల్ నుంచి వచ్చాక స్కూల్ ఎలా ఉంది అని అడగాలి. వాళ్లు బాలేదు అంటే ఏం బాలేదు అని అడగండి. అప్పుడు వాళ్లకు నచ్చని వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడండి. దాంతో వాళ్లలో మార్పు వస్తుంది.

- పిల్లలకు టీచర్ అంటే చాలా భయమేస్తుంది. కాబట్టి ముందు టీచర్ ని ఇష్టపడేలా చేయాలి. అమ్మ, నాన్న ఏం కావాలన్నా టీచర్ నే అడగాలని, టీచర్ కూడా మమ్మీ డాడీల్లాగే చూసుకుంటుందని చెప్పాలి.

- స్కూల్ కి తీసుకెళ్లినప్పుడు కొన్ని రోజులపాటు మీరు లోపలకు వెళ్లి టీచర్ తో కలివిడిగా మాట్లాడండి. అది చూస్తే తను కూడా మన మనిషే అన్న నమ్మకం కలుగుతుంది.

- స్కూల్లో మీ పాప/బాబు పక్కన కూర్చునే వాళ్లతో కూడా మాట్లాడండి. అది చూసి పిల్లలు కూడా వాళ్లతో చనువుగా మాట్లాడతారు. కలిసిపోతారు.

- ఇక పొద్దున్నే లేవడం కూడా పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. బడి మీద భయంతో అస్సలు లేవరు. లేచినా స్నానం చేయనంటారు. టిఫిన్ తిననంటారు. రకరకాల సాకులు చెబుతారు. ఎంత త్వరగా స్కూల్ కి వెళ్తే అంత త్వరగా ఇంటికి వచ్చేయవచ్చని చెప్పండి. రోజూ సాయంత్రం వచ్చాక తను ఎంజాయ్ చేసేది ఏదో ఒకటి రెడీగా ఉంటుందని చెప్పండి. తనకిష్టమైన ఫుడ్ ఐటమ్ చేస్తాననో, ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్తాననో ఏదో ఒకటి. దాంతో హుషారుగా వెళ్తారు.

అందరు పిల్లల విషయంలోనూ ఇంత కష్టపడక్కర్లేదు. స్కూల్ అనగానే భయపడిపోయి ఎంతకీ అలవాటు పడని పిల్లల విషయంలో ఈమాత్రం కష్టపడక తప్పదు. ఒక్కసారి అలవాటు పడితే వాళ్లకీ ఇబ్బంది ఉండదు... మీకూ ఉండదు.

- Sameera