టమాటాతో అందం,ఆకర్షణ.. ఫ్రీ

చర్మ సమస్యలను చాలా సులువుగా టమాటాలతో నివారించవచ్చు. సహజ సన్‌ స్క్రీన్‌ లా పనిచేసే టమాటాతో మొటిమలువంటివి పోయి, మంచి నిగారింపు కూడా వస్తుంది. అసలు ఈ టమాటలను ఏ విధంగా వాడలో చూద్దామా...!

1. జిడ్డు చర్మం వారు... ఒక టమాటాను గుజ్జులా చేసి వడకట్టి, దీనికి కొద్దిగా కీరదోస రసం కలిపి దూదితో ముఖమంతా రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జిడ్డు చర్మం పోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

2. తాజా టమాటా రసం ఓ టేబుల్‌ స్పూను తీసుకుని నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖమంతా రాసుకుంటూ, మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లనినీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న అధికజిడ్డు, మురికి వదులుతుంది.

3. టమాటారసం చిక్కని మిశ్రమం అయ్యేదాకా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత కడిగేయాలి. ఎండ కారణంగా నల్లగా మారి జీవం కోల్పోయిన చర్మానికి మెరుపునందిస్తుంది.

4. టమాటాతో ఇంట్లోనే క్లెన్సర్‌ ను తయారు చేసుకోవచ్చు. టమాటాగుజ్జుకు సమపాళ్లలో పాలు కలపాలి. దీన్ని సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌ లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ముఖం, మెడకు రాసుకుని మునివేళ్లతో మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక చల్లనినీటితో కడిగేసుకుంటే.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.

5. ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది.

6. అదే విధంగా టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.