రాజస్థానీ పాలరాయితో చేసిన చిన్న చిన్న విగ్రహాలు హాలో మూలల్లో బ్రాస్ స్టాండ్ లలో అమర్చి వున్నాయి.

 

    అంత ఖరీదైన గృహాంతర్భాగాన్ని చోడటం సామంత్ కి అదే తొలిసారి.

 

    సామంత్ ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ-

 

    "ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారివన్నీ?" అని ప్రశ్నించాడు.

 

    వి.సి.ఆర్.ని ఆన్ చేయబోతున్న కనకారావు బిత్తరపోయి "కొట్టుకురావటమా?" అన్నాడు.

 

    "అవును. కాకపోతే ఎత్తుకు రావటం"

 

    "టాపిక్ డైవర్ట్ చెయ్యకయ్యా... నీకాళ్ళు పట్టుకుంటాను. ఎందుకయ్యా నన్నిలా హింస పెడతావు? నేర్చుకోవల్సినవన్నీ త్వరగా నేర్చేసుకుంటే మనకప్పగించిన పని పూర్తయిపోతుంది. ఆ తరువాత నీ దారి నీది, నా దారి నాది. మరలా జన్మలో నీకు నా మొఖాన్ని చూపిస్తే చెప్పుతో కొట్టు..."

 

    సామంత్ నవ్వుతూ కానివ్వమన్నట్లు కళ్ళతోనే సైగ చేసాడు.

 

    కనకారావు వి.సి.ఆర్ ప్లే బటన్ నొక్కాడు.

 

    కలర్ టెస్టింగ్. సెవెన్ కలర్ స్కీమ్ తెరమీద ప్రత్యక్షమయింది.

 

    సామంత్ అక్కడే వున్న సోఫాలో కూర్చొని టీవీ కేసే చూడసాగాడు.

 

    కొద్దిక్షణాలకి తెరమీద ప్యారిస్ ఫ్యాషన్ డిజైనర్స్ సెయింట్ లారెంట్ కార్డిన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన మేల్ ఫ్యాషన్ షో మొదలయింది.

 

    అప్పటివరకు సరదాగా, తమాషాగా కనకారావుతో కబుర్లు చెప్పిన సామంత్ లో ఇప్పుడు ఏకాగ్రత గూడు కట్టుకుంది.

 

    ఇప్పుడిహ అతని పక్క అణుబాంబు విస్ఫోటనం చెందినా చెక్కు చదరడు అన్నట్లున్నాయి అతని చూపులు.

 

    సన్నగా, బక్కపల్చగా వున్న వ్యక్తుల దగ్గర్నుంచి, టాప్ సీడ్ బాక్సింగ్ ఛాంపియన్ లా వున్న వ్యక్తుల వరకు రకరకాల దుస్తులు స్టయిల్ గా మగసిరి ఉట్టిపడేలా, నడవటం, మెట్లు ఎక్కటం, వివిధ రకాల భంగిమల్లో దినచర్యలోని కొన్ని పనుల్ని చేయటం లాంటివి స్పష్టంగా కనిపిస్తోంది.

 

    పురుష దుస్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బార్నేస్ ఇంగ్లీషు రూమ్ దుస్తుల్లో మేల్ మోడల్స్ చకచకా డ్రస్ ల్ని మారుస్తున్నట్లు స్టాప్ బాక్ లో చూపించటం జరుగుతుంది.

 

    EXPRESS YOURSELF IN ENGLISH

 

    అనే స్లోగన్ తెరమీద ఇన్ సర్ షన్ లా కుడినుంచి ఎడమవేపుకి వెడుతూ వుంది.

 

    "కనకారావూ ఆ ఇంగ్లీసుని చదువగలుగుతున్నాను గాని - దాని అర్థం తెలీటం లేదోయ్ ఏమిటో చెప్పు..." సామంత్ ఓ వేపు టీవీవేపు చూస్తూనే అడిగాడు.

 

    "నేను చెబుతాను" అనే మాటలు వెనుకనించి వినిపించటంతో గిరుక్కున తలతిప్పి చూసాడు సామంత్.

 

    అక్కడో వ్యక్తి వున్నాడు. అతను వచ్చి ఎంతసేపయిందో తెలీలేదు.

 

    "నిన్ను నువ్వు ఆంగ్లంలో వ్యక్తం చేసుకో అంటే బార్నేస్ ఇంగ్లీషు రూమ్ బట్టలు లేటెస్ట్ వి, ప్రతిష్టాత్మకమైనవి. అవి వేసుకొని నీ ఫిజికల్ పర్సనాలిటీని గర్వంగా వ్యక్తం చేసుకో అని..." చెబుతూ ఆ వ్యక్తి వచ్చి సామంత్ కి పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు.

 

    టీవీలో వస్తున్న ప్రతి కొత్త ఫ్రేమ్ గురించి ఆ వ్యక్తి వివరంగా తెలియజేస్తున్నాడు సామంత్ కి.

 

    సామంత్ స్వతహాగా సూక్ష్మగ్రాహి కావటంతో చూస్తూనే దానిలోని ప్రత్యేకతను పట్టేస్తూ, ఆపై వాటిని తన జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తం చేసుకుపోతున్నాడు.

 

    క్షణాలు... నిమిషాలు... దొర్లిపోతున్నాయి.

 

    కాలం కరిగిపోతోంది.

 

    సీరియస్ గా ట్రైనింగ్ మొదలయిపోయింది.

 

    మరో గంటకు మరో వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో టేప్ వుంది. అప్పటికి క్యాసెట్ కూడా పూర్తి కావటంతో కనకారావు సజెషన్ తో వచ్చినతను సామంత్ మెజర్ మెంట్స్ తీసుకున్నాడు వి.సి.ఆర్.లో మరో క్యాసెట్ ని ఇన్ సర్ట్ చేసాడు కనకారావు.

 

    సామంత్ శ్రద్ధగా టీవీ వేపే చూస్తుండగా-

 

    "హైక్లాస్ సొసైటీలోని యువకుల అలవాట్లు, మాట తీరు, బిహేవియర్ ఎలా వుంటాయో ఇప్పుడు నీకు తెలుస్తుంది. మనకు చాలా తక్కువ టైమ్ వుంది. నువ్వు చాలా ఫాస్ట్ గా వాటన్నింటిని మెదడుకి ఎక్కించుకోవాలి..." పక్కనున్న వ్యక్తి తిరిగి అన్నాడు.

 

    అర్జునరావుది సి.ఐ.ఎ. స్థాయి బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో రూపుదిద్దుకొన్న పథకం ఇప్పుడు ఈ దర్గాలోని పురాతన కోటలో ఊపిరి పోసుకుంటోంది.


                                                       *    *    *    *


    సరీగ్గా ఉదయం 8-40కి ఢిల్లీ ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పానమ్ లాండ్ అయింది.

 

    రియల్ సీట్ లో కూర్చుని అప్పటివరకు ఫైబర్ విండోలోంచి లాండ్ స్కేప్ చూస్తున్న నాయకి గుండెల నిండా మాతృదేశాన్ని చూడబోతున్నానన్న ఆనందం ఉప్పెనలా ఉప్పొంగింది.

 

    తన ఊహలకే రెక్కలు పుట్టుకొస్తే క్షణాల్లో వెళ్ళి నాయనమ్మ ఒడిలో వాలిపోయి సేద తీరాలనుంది.

 

    ప్యాసింజర్స్ అందరూ లేచి నించున్నారు.

 

    నాయకి బ్యేగేజ్ కేబిన్ ఓపెన్ చేసి చిన్న బ్యాగ్ ని అందుకొని భుజానికి తగిలించుకొని నెమ్మదిగా నడవటం ప్రారంభించింది.

 

    ఎయిరో బ్రిడ్జిని తెచ్చి ఫ్లయిట్ డోర్ కి లింక్ చేసారు అప్పుడే.

 

    ప్యాసింజర్స్ మూవ్ అవటం మొదలయింది.

 

    అప్పటివరకు ఎయిర్ పోర్ట్ సెకెండ్ ఫ్లోర్ లాంజ్ లో నించుని వున్న అర్జునరావు, పీటర్ నేమ్మగా అవుట్ గేట్ కేసి సాగారు.

 

    "ఈపాటికి రెడీ అయివుంటాడా?" అర్జునరావు నెమ్మదిగా మెట్లు దిగుతూ అడిగాడు.

 

    "నాకందిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం మరో వారంరోజుల్లో అతను పక్కాగా సానబెట్టబడతాడు."

 

    "అతనెలా వుంటాడు?"

 

    "అచ్చం దొరబాబులా వుంటాడు"

 

    "గతంలో ఏం చేస్తుండేవాడు?"

 

    "ఎవరో పెద్దవాళ్ళు చేసిన నేరాల్ని తన నెత్తిన వేసుకొని పోలీస్ స్టేషన్ కి, జైల్ కి వెళ్ళొస్తుంటాడు"

 

    "వెనకా ముందు ఎవరన్నా వున్నారా?"

 

    "ఉన్నారు. ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, అమ్మ. తండ్రి రిటైర్డ్ స్కోల్ టీచర్. పెరాలిసిస్ వచ్చి మంచమెక్కాడు. తమ్ముడు, చెల్లి చదువుకుంటున్నారు"

 

    "ఆటోమొబైల్ ఇంజనీర్ గా రంగప్రవేశం చేయిస్తున్నాం. కనీసం కారెలా వుంటుందో తెలుసా?"

 

    "అతను నెంబర్ వన్ మెకానిక్. ఎలాంటి కారునయినా గంటల్లో సెట్ రైట్ చేస్తాడు. సైలెన్సర్ నుంచి వచ్చే శబ్దాన్ని, పొగని బట్టి ఆ బండి లీటర్ కి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చెప్పగలడు."

 

    "అదెలా సాధ్యం?"