కాంతినిచ్చే ఫేస్ ప్యాక్ లు

చర్మం విపరీతంగా పొడిబారడం ,పాలిపోయి నిర్జీవంగా మారడం ….ఇలా ఎన్నో ఇబ్బందులు ముఖ కాంతిని తగ్గిస్తాయి .ఇలాంటి సమస్యల్ని నివారించాలంటే ఇంట్లోనే దొరికే వాటితో స్వయంగా చర్మ కాంతికి కావలసిన వాటిని తయారు చేసుకొని,బంగారం లాంటి నిగారింపును పొందవచ్చు.

పుదీనా ఫేస్ ప్యాక్: తాజా పుదీనా ఆకుల్ని మిక్సిలో వేసి, మెత్తని పేస్టులా చేసి, అందులో చిటికెడు పసుపు కలపాలి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేసుకొని, తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

సోయా గింజలతో: 50 గ్రాముల సోయాగింజలని రాత్రంతా నానబెట్టి, ఉదయం మెత్తటి పేస్టులా చెయ్యాలి. ఆ పేస్టులో పచ్చి పాలు, బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, కాసేపయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచు చెయ్యడం వలన ముఖం కాంతివంతం అవుతుంది.

కీరదోసతో: కీరదోసకాయని మెత్తగా చేసి, దానికి ఒక టీ స్పూన్ పంచదార కలిపి ఫ్రిజ్ లో కొద్దిసేపు ఉంచాలి. కాస్త చల్లగా అయ్యాక ఆ పేస్టుని ముఖానికి రాసుకొని 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం జిడ్డుగా మారకుండా కాంతివంతంగా మారుతుంది.


- వై. లిల్లీ నిర్మల శాంతి