మీ అందాన్ని పెంచే టోనింగ్ సీక్రెట్స్...!

చర్మానికి అందాన్ని తెచ్చి, కాంతివంతంగా మార్చే టోనింగ్ గురించి మీకు ఏమైనా తెలుసా..? అసలు ఈ టోనింగ్ ను ఎలా వాడాలి? ఎలా తయారు చేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకొని, టోనింగ్ ద్వారా మన అందాన్ని మరింత కాంతివంతంగా తయారు చేసుకుందామా..!

ఇంట్లోనే తయారీ :

* టోనర్ల తయారీలో ఎక్కువగా వాడే పదార్ధం రోజ్ వాటర్. కాబట్టి దీన్ని అందుబాటులో పెట్టుకుంటే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.

* కప్పు రోజ్ వాటర్ కు రెండు కప్పుల గ్లిజరిన్ కలపండి.దీన్ని ఫ్రిజ్ లో భద్రపరచుకుని, ప్రతిరోజూ కొద్దికొద్దిగా రాసుకోండి.

* చిన్న కీరదోస తీసుకుని మెత్తగా గుజ్జులా చెయ్యండి. దీనికి అరకప్పు పెరుగు కలపండి. ఒక స్పూన్ మిశ్రమాన్ని తీసుకుని చర్మానికి రాసుకుని కడిగేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

* పొడిబారిన చర్మత్వం ఉన్నవారు రెండు కప్పుల పుదీనా ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. చిక్కని ఈ నీటిని వడకట్టి సీసాలోకి తీసుకోవాలి .దీనికి కాసిని నీళ్ళు కలిపి, మేకప్ వేసుకునే ముందు చర్మానికి రాసుకోండి.

* కోడిగుడ్డు బాగా గిలకొట్టి, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలపాలి. ముఖానికి, మెడకు బాగా రాసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయ్యాలి.

టోనింగ్ వాడేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

* ముందు చర్మాన్ని శుభ్రం చేసుకుని అంటే క్లెన్సింగ్ తర్వాత టోనింగ్ చెయ్యాలి టోనర్ లో దూదిని ముంచి చర్మనికి రాసుకోవాలి. అది చర్మం పై సహజ సిద్దంగా ఆరాక తొలగించాలి.

* పొడి చర్మం ఉన్నవారు రోజుకు ఒకసారికి మించి టోనర్ వాడకూడదు.

* టోనింగ్ పూర్తయ్యాక వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. లేదంటే చర్మం పొడిబారి గట్టిగా మారుతుంది.

* కానీ టోనింగ్ అనేది అందరికి సెట్ అవదు. కాబట్టి ఒకవేళ దానిని రాసుకున్న తర్వాత, చర్మం మంటగా ఉన్నా, దురదగా అనిపించిన, జిడ్డుగా మారిన కూడా వెంటనే మానేయ్యండి.