
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -748 లో.....జ్యోత్స్న, కార్తీక్ ఇంటి నుంచి తిరిగి వెళ్లేందుకు క్యాబ్ కోసం చూస్తుంటే ఒక్క క్యాబ్ కూడా దొరకదు. ఇంతలో సూరజ్ బైక్‌పై వస్తాడు. ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుంది.. పైగా వర్షం పడేలా ఉంది..రా, లిఫ్ట్ ఇస్తానని అంటాడు. నువ్వు ఎంత అడిగినా నేను రానని జ్యోత్స్న చెప్తుంది. గొడవలన్ని పక్కనపెట్టి ఎక్కు వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతామంటూ సూరజ్ ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు. ఇంటి దగ్గర దింపిన తర్వాత సూరజ్.. నీ మనసులో ఎవరు లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నావని సూరజ్ అంటాడు. జ్యోత్స్న మాత్రం.. ఒకప్పుడు మా బావ అంటే నాకు ప్రాణం.. కానీ ఇప్పుడు అది ప్రేమ కాదు, పంతం అని అర్థమైంది. అందుకే ఆయన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశాను. నా మనసులో ఎవరికి స్థానం లేదు. నా కోసం నేనే బతుకుతానని చెప్తుంది. దాంతో సూరజ్ .. వెరీ గుడ్.. నీ నిర్ణయం వల్ల ఇంకెవ్వరి జీవితాలు నాశనం కాకుండా ఉంటాయని అంటాడు.
మరుసటి రోజు జ్యోత్స్న కుటుంబం సూరజ్‌ను పిలిచి మాట్లాడుతుంది. సుమిత్ర..నీ వల్ల జ్యోత్స్న చాలా బాధపడుతోంది.. తిండి, నిద్ర కూడా మానేసింది. నువ్వే దాన్ని బాధపెడుతున్నావని అంటుంది. సూరజ్ మాత్రం.. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని మీకు తెలుసు. దీప మెడలో కార్తీక్ తాళి కట్టిన తర్వాత అతను జ్యోత్స్నకు భర్త కాలేడని తెలిసినా.. మీరు ఆమె మనసును మార్చలేకపోయారు. ఎందుకంటే మీరు మనిషిని మార్చాలని ప్రయత్నించారు కానీ మనసును మార్చాలని ప్రయత్నించలేదని సూరజ్ చెప్తాడు. దీప, కార్తీక్‌లు కూడా.. నువ్వు అదే చేస్తున్నావ్ కదా.. మరి ఆమెను పట్టించుకోనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావ్.. మాట్లాడి కూడా మార్చొచ్చు కదా అని ప్రశ్నిస్తారు.
అప్పుడు సూరజ్ తన మనసులోని మాటను బయటపెడతాడు. ఈరోజు జ్యోత్స్న బాధపడొచ్చు.. కానీ తన మనసు ఏంటో తను అర్థం చేసుకున్న రోజున కన్నీళ్లు రావు. జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం. తనను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అందుకే తన మనసును మార్చాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమెలో కనిపిస్తున్న బాధ కూడా ఆ మార్పులో భాగమే. నేను కోరుకున్న విధంగా ఆమె మనసు మారినప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.. నాకే అర్థమైపోతుంది. జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బతికేంత ప్రేమ నాలో ఉందని అంటాడు. మేడపై నుంచి ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న భావోద్వేగానికి గురవుతుంది. తన పేరు చెప్తే కోప్పడే జ్యోత్స్న.. సూరజ్ తనపై చూపిస్తున్న ప్రేమను మాత్రం మౌనంగా వింటుంది. మరోవైపు రెస్టారెంట్ విషయంలో మాలిని, శివన్నారాయణల మధ్య కూడా గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






