.webp)
జబర్దస్త్, పటాస్ షోస్ తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఇంట్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య వంశిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రవీణ్.. వంశిత అనే డ్యాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, రీల్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. కొన్ని నెలల క్రితమే వంశిత తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తాజాగా వంశిత పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని ప్రవీణ్ స్వయంగా హాస్పిటల్ నుంచి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భార్యకు ప్రవీణ్ దగ్గరుండి సేవలు చేయడం, వంశిత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లడం, డాక్టర్లు పాపాయిని తీసుకురావడం వంటి క్లిప్పింగ్స్ అన్నీ ఈ వీడియోలో చూపించారు.
అంతేకాకుండా తొలిసారి తన బిడ్డను చేతుల్లోకి తీసుకున్న ప్రవీణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన క్షణాలను వీడియోలో పంచుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీవీ సెలబ్రిటీలు, నెటిజన్లు ప్రవీణ్, వంశిత దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్ ఇంట్లోకి కొత్త అతిథి రావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రవీణ్ దంపతులకు పాపాయి రూపంలో వచ్చిన ఈ కొత్త సంతోషం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.





