.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1192 లో.....ఐశ్వర్య కంపెనీతో రూ.300 కోట్ల భారీ వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న రఘువీర్‌ను ఎక్స్పో నిర్వాహకులు ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. ఆయన రాకతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత వచ్చిందని ప్రశంసిస్తారు. అయితే రఘువీర్‌కు ఇస్తున్న గౌరవాన్ని చూసిన రాజుకు తీవ్ర కోపం వస్తుంది. ఒకప్పుడు తనతో చీప్ గా ప్రవర్తించి తన చేతిలో చెప్పుదెబ్బలు తిన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ చీఫ్ గెస్ట్‌గా ఎలా వచ్చాడని అసహనం వ్యక్తం చేస్తాడు. రాజు మాటలకు ఇందు కూడా ఆశ్చర్యపోతుంది. తను కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నానని చెప్తుంది.
అసలు ఐశ్వర్య కంపెనీలో ఏం చూసి రఘువీర్ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడనే అనుమానం రాజుకు కలుగుతుంది. చిన్న కంపెనీని నడుపుతున్నారని అందరు చెప్తున్నప్పటికీ అంత పెద్ద డీల్ వెనుక ఏదో మతలబు ఉండొచ్చని భావిస్తాడు. రఘువీర్ గురించి అసలు నిజాలు తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు వేదికపైకి వచ్చిన రఘువీర్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఇందు, రాజుల పేర్లను ప్రస్తావించి కృతజ్ఞతలు చెప్తాడు. దీంతో రాజుకు మరింత చిరాకు వస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోదామని ఇందుతో చెప్పినా రఘువీర్ తర్వాత ఏం మాట్లాడతాడో చూద్దామని ఆమె ఆపుతుంది.
ఆ తర్వాత ఐశ్వర్యను కూడా వేదికపైకి ఆహ్వానించి రఘువీర్ చేతుల మీదుగా విన్నర్ అవార్డును అందజేస్తారు. ఐశ్వర్య జువెల్లర్స్ ఈ నగరంలోనే అతిపెద్ద కంపెనీగా ఎదగబోతోందని నిర్వాహకులు ప్రశంసిస్తారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. సాధారణంగా తన విజయానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు చెప్తారని కానీ తను మాత్రం చెప్పనని, ఎందుకంటే ఈ విజయం కోసం కష్టపడింది తానేనని చెప్తుంది. తన గెలుపు కోసం పూజలు చేసిన అభిమానులకు మాత్రం ధన్యవాదాలు తెలుపుతుంది. ఐశ్వర్య మాటలు విన్న రాజు అక్కడ అభిమానులు ఎవరున్నారని వెతుకుతూ పార్వతీశంను చూసి కామెంట్ చేస్తాడు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తానని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేస్తుంది.
అవార్డు కార్యక్రమం ముగిసిన తర్వాత రఘువీర్‌ను ఐశ్చర్య కలిసి కృతజ్ఞతలు చెప్తుంది. తనకు ఇంత పెద్ద విజయం దక్కడం కలలా ఉందని అంటుంది. అయితే రఘువీర్ మాత్రం నీ చేతిలో విన్నర్ ప్రైజ్ ఉంది కదా ఇంకా అనుమానం ఎందుకని ప్రశ్నిస్తాడు. ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని, వ్యాపారంలో ఆమె పట్టుదలను ప్రశంసిస్తూ దుగ్గిరాల కుటుంబం నుంచి వేరుగా ఎదగాలనే ఆమె ఆలోచన తనను ఆకట్టుకుందని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
