
హాలీవుడ్ నిర్మించిన గ్రాండ్ విజువల్ ఎపిక్ ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని రీతిలో భారీ కలెక్షన్ల తుఫాను సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ హాలీవుడ్ విజువల్ వండర్, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ హాలీవుడ్ వండర్ చూసిన మన తెలుగు ప్రేక్షకులు, సినిమా విశ్లేషకులు మాత్రం ఇందులో మన జానపద బ్రహ్మ బి. విఠలాచార్య సినిమాల ఛాయలను, భారతీయ పురాణాల మూలాలను గుర్తుచేసుకుంటున్నారు.
ఒడిస్సీ సినిమాలో కనిపించే ప్రతిష్ఠాత్మక సన్నివేశాలు, విభిన్న పాత్రల చిత్రణ చూస్తుంటే విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు గుర్తుకొస్తున్నాయి. అంతేకాదు, తెలుగులో వచ్చిన ఇతర జానపద చిత్రాలు కూడా గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ‘పాతాళ భైరవి’, ‘జగదేకవీరుని కథ’ వంటి క్లాసిక్ జానపద చిత్రాలు కళ్లముందు మెదులుతున్నాయి. ఇందులో వచ్చే మాంత్రికురాలి ఎపిసోడ్, భయంకరమైన ఒంటికంటి రాక్షసుడి ఘట్టాలు, వింత దీవుల సాహసాలు అచ్చంగా మన తెలుగు జానపద కథలను తలపిస్తున్నాయి.
నిజానికి ఇది ప్రాచీన గ్రీకు కవి హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ ఆధారంగా రూపొందినప్పటికీ.. గ్రీకు పురాణాలకు, మన భారతీయ పౌరాణిక ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలకు మధ్య ఉన్న విడదీయరాని పోలికలే ఇందుకు ప్రధాన కారణం. రామాయణంలో శ్రీరాముడు శివధనుర్భంగం చేసి సీతాదేవిని స్వయంవరంలో వివాహం చేసుకున్నట్లే, ఈ సినిమాలోనూ గొడ్డలి రంధ్రాల గుండా బాణం వేసి నాయకుడు స్వయంవరం గెలిచే ఘట్టం అచ్చంగా భారతీయ పౌరాణిక శైలిలోనే సాగుతుంది.
ప్రపంచవ్యాప్త పురాణాలు, ఇతిహాసాలు ఎక్కడో ఒకచోట ఒకే మానవ మూలానికి కనెక్ట్ అవుతాయనడానికి ఈ ఒడిస్సీ చిత్రం ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది. భాగవతంలోని శ్రీకృష్ణుడి జనన ఘట్టాలకు, బైబిల్లో యేసుక్రీస్తు జననానికి మధ్య ఉన్న ఆసక్తికరమైన పోలికల తరహాలోనే, గ్రీకు కథలలోని సృష్టికర్త బ్రహ్మ-ఇబ్రహీం పోలికలు, దేవతల ఘర్షణలు భారతీయ పురాణాలను ప్రతిబింబిస్తాయి. ప్రాచీన కాలంలో అలెగ్జాండర్, సెల్యూకస్ వంటి గ్రీకు పాలకులు భారతదేశానికి వచ్చినప్పుడు, ఇరు సంస్కృతుల మధ్య జరిగిన సాంస్కృతిక పరిచయాలు, బౌద్ధమత ప్రభావాలు ఈ పురాణాల కలయికకు మూలకారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, ఈ హాలీవుడ్ ఎపిక్ చిత్రానికి భారత్ నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణను మన భారతదేశపు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి టీమ్ అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ కోసం ‘ది ఒడిస్సీ’ సాధిస్తున్న విజయాన్ని ఒక 'టెస్ట్ ట్రయల్' లా భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ పౌరాణిక మూలాలను మిక్స్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి, అంతర్జాతీయ కథలను మన భారతీయ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు అనే కోణంలో రాజమౌళి బృందం ఈ సినిమా వసూళ్లను, పబ్లిక్ టాక్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయ పురాణాల సారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే రాజమౌళి ‘వారణాసి’ చిత్రానికి ఈ ఒడిస్సీ సృష్టించిన సంచలనం ఒక మార్గదర్శిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Christopher Nolan, The Odyssey, Greek Mythology, Indian Mythology






