తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రలను ప్రేక్షకులకు అందించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా ఏ తరహా సినిమాలో నటించినా తనదైన ముద్ర వేసేవారు. ఆయన నటించిన ‘విశాల హృదయాలు’ సినిమాలోని ఓ సన్నివేశం ఇప్పుడు పాత తెలుగు సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదరికం కారణంగా ఎదురయ్యే అవమానాలను, వాటిని సహించలేని ఆత్మగౌరవాన్ని ఈ సన్నివేశంలో అద్భుతంగా చూపించారు.
భార్య పార్వతి చెల్లి పెళ్లికి శుభలేఖ వచ్చినా, సంపన్నుల ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్ మొదట సంశయిస్తారు. అక్కడ తనకు ఎదురయ్యే అవమానాలను తట్టుకోగలనని, కానీ భాగ్యవంతుల ఇంట్లో పుట్టిన పార్వతి మాత్రం చిన్న అవమానానికే బాధపడుతుందని చెబుతాడు. ఈ సందర్భంగా దక్షయజ్ఞం, పార్వతీదేవి ఉదాహరణను కూడా ప్రస్తావిస్తాడు. అయినప్పటికీ భార్యతో కలిసి పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది.
పెళ్లి వేడుకకు పార్వతి ముందుగా వెళ్లగా, ఎన్టీఆర్ తన కొడుకుతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. కొడుకు పేరు వీరభద్రరావు అని తాతయ్యకు పరిచయం చేస్తాడు. అక్కడి మర్యాదలు, చీర విషయంలో వచ్చే మాటలు.. ఆ ఇంట్లో పేద, ధనికుల మధ్య ఉన్న అంతరాలను బయటపెడతాయి. ఇంతలో రవ్వల దుద్దులు కనిపించకుండా పోవడంతో, ఆ నిందను చిన్నవాడైన వీరభద్రరావుపై వేసే ప్రయత్నం చేస్తారు. దీంతో ఎన్టీఆర్ పాత్ర సహనం కోల్పోతుంది.
పేదవాళ్లను డబ్బుతో కొలిచే సంపన్నుల మనస్తత్వాన్ని ఆయన తీవ్రంగా నిలదీస్తాడు. కష్టపడి పనిచేసే పేదవాళ్ల శ్రమను దోచుకుంటూ, వారినే అనుమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తాడు. తన కొడుకుపై దొంగతనం నింద వేయడాన్ని అవమానంగా భావిస్తాడు. కన్నవారి ఇంట్లోనే ఇలాంటి అవమానం ఎదురవడంతో పార్వతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది.
చివరికి ఆస్తులు, అంతస్తుల అహంకారం ఉన్న ఆ ఇంటి గడపను మళ్లీ తొక్కబోనని ఎన్టీఆర్ తేల్చి చెబుతారు. డబ్బు లేకపోయినా ఆత్మగౌరవం ఉందని తన మాటలతో స్పష్టం చేస్తూ భార్యాబిడ్డలతో అక్కడి నుంచి బయటకు నడుస్తాడు. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ పలికే సంభాషణలు, చూపించే హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అప్పటి సమాజంలోని ఆర్థిక అసమానతలను, మనుషుల మధ్య డబ్బు సృష్టించే అంతరాలను గుర్తుచేసే ఈ సన్నివేశం ఇప్పటికీ ఆలోచింపజేస్తుంది. ఇలాంటి అర్థవంతమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
[VisalaHrudayalu, NTR, NandamuriTarakaRamaRao, TeluguOldMovies, KrishnaKumari]




